పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/552

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

556

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వ్యాఖ్యానిస్తుంది. ఆయీ సందర్భం ప్రస్తుతానికి యెంత అనుగుణంగా వుందో? విజ్ఞులు విచారింతురుగాక. ఆయీవిశేషం నాకిప్పుడే స్ఫురించిందని మొదటనే వ్రాసి వున్నాను. యింకోమాట యిక్కడ వ్రాయవలసింది మఱిచాను. నేను విమర్శకుఁడుగారి యింటిపేరుగాని పేరుగాని యింతవఱకెక్కడా వుదాహరించనే లేదు. దానికి నేను చెప్పఁదలచిన కారణం.

“శ్లో ఆత్మనామ గురోర్నామ... న గృహ్ణీయాత్"

అన్న అభియుక్తోక్తియే! వీరు నాకు పంచగురువులలో వకగురు స్థానం అని మొదటనే సూచించి వున్నాను. జయంతిలో ప్రకృతివికృతిభావ ప్రకారంగా వున్న యింటిపేరు బుద్ధిపూర్వకంగా వ్రాసింది కాదుకనుక ఆ నిషేధానికి నేను గుఱిగానని ఆయాశాస్త్రజ్ఞులకు మనవి చేసికొని ప్రస్తుత మందుకుంటూ వున్నాను. వీరు నన్ను యెంత పచ్చిగా తిట్టినా నాకు వీరి కవిత్వంలోవుండే సాఫుదనమే ముఖ్యంగా కావలసింది. అందుకే నేను వీరిని సమ్మానింపఁదలంచిందని నన్నయ్యవ్యాసంలోనే నొక్కినొక్కి వ్రాసి వున్నాను. దాన్ని స్వాగతంలో- "కత్తిఝళిపించడాన్ని వుటంకించినవారు చదివి గ్రహించే వున్నారు. శిష్ట్లావారు అంతశ్రద్ధగా దాన్ని చదవేలేదో? లేక అసలే చదవే లేదో? వీరివిమర్శనాన్ని నేను అభినందించినట్లే అభిప్రాయపడి ఆ విధంగా వీరిని మెచ్చడం జరిగింది. మెచ్చదగినశంకలు వున్నప్పటికీ నేను మెచ్చలేదంటే అదినాకుకళంకు. విమర్శకుఁడుగారు మాత్రమేకాదు. యెవరేనా ఆ ప్రశ్నలలో సారవంతమైనది వుందంటే నేనున్నూ వప్పుకుంటాను. వొప్పక తప్పుతుందా? వాది ప్రతివాదులు వొకరివాదాన్ని వేఱొకరు మెచ్చడమంటూ వుండనేవుండదన్నది సామాన్యపుమాట గాని విశేషపుమాటకాదు. ఆ పక్షంలో నేను వీరికవిత్వం సాఫుగా వుందని, త్రికరణశుద్ధిగా వొప్పుకోవడమే కాకుండా దానికోసం వీరిని సమ్మానించడానికి ఆహ్వానించడం యేలా సంభవిస్తుంది? దీనిచేతనే ఆ సామాన్యపుమాట వెం. శా. గారికి ప్రతిబంధించేదికాదని ప్రాజ్ఞలోకం విశ్వసిస్తుంది. వున్నంతలో గుణాన్ని అంగీకరించడమే నామతం. ప్రతి వాఁడికవిత్వమూ బాగానేవుందంటూ సర్టిఫికేట్లిస్తూవుంటావు, నీకేమేనా మతి వుందా లేదా అంటూ మాతిరపతిశాస్త్రి నన్ను గేలిచేస్తూవుండేవాఁడు. ప్రతివాణ్ణి విద్యార్థిగా చేర్చుకొని యేదో చెప్పడమే నాపని. ప్రాయోపవేశావస్థలో వున్నయిప్పుడుకూడా "బ్రామి" న్సైతేనేమి, “నాన్ బ్రామి" న్సైతేనేమి, సుమారు పదిమందికి తక్కువగాలేరు. యిక్కడ వీళ్లని గుఱించి యెందుకు వ్రాస్తానంటే? ప్రస్తుత మవడంచేతనే, అప్రస్తుతపు వ్రాఁత వ్రాయడం నాలేఖినికి బొత్తిగా చేతకాదు. మావిమర్శకుఁడుగారు వారి (ధూళిపూడి) గ్రామానికి సన్మానించే సదూహతో నన్ను రావలసిందని ఆహ్వానించారు గదా? నాకుకావలసిన సదుపాయాలు లోఁగడ వుటంకించి