పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/526

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

530

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


అన్నట్లున్నూ“వీరభద్రపళ్లెమునకు హనుమత్పళ్లె" మన్నట్టున్నూ బలవంతంగా కాకపోయినా యేదో విధంగా వీడువాడు గదా? అనే పూర్ణ విశ్వాసంతో ఆహ్వానిస్తున్నారు. నాకు (కృతికన్యాభర్తృత్వద్వారా) అల్లునకు ప్రస్తుతస్థితినిబట్టి యిచ్చేబహుమానం “చంద్రుడికి నూలుపోగు" సామెత వుండనేవుంది కనుక (తావన్మాత్రమే) కౌపీనం యిచ్చినా నేనుసంతోషిస్తాను. సందేహపడనక్కఱలేదు. “శ్వశురాగారసమ్మానంసద్యోగృహ్ణాతి పండితః" కనక మీసత్కారాన్ని పొందడానికి నేను ఉవ్విళ్లూరుతున్నాను. నన్ను సత్కరించడానికి మీకు యెక్కువ వ్యయప్రయాసలు తగలవు గానిరాకపోకలకు అధమం నలభైయాభై రూపాయిలదాకా తగులుతాయనిన్నీ ఆహేతువుచేత అది సాధుబాధగా పరిణమిస్తుందేమో? అనిన్నీ సంశయిస్తూన్నాను. తమకు అంగీకారమయితే యేలాగో బయలుదేఱి తమ సమ్మానాన్ని పొంది మీ గ్రామస్థులసందర్శనం చేదామని కుతూహలం యింతా అంతా కాదుసుమండీ! బోలెఁడువుంది. నా ప్రస్తుతస్థితినిబట్టి నాకు చేయవలసిన సదుపాయం అంతగా వ్యయప్రయాసలకు గుఱిఅయి వుండదు. ఉదయం 8 గంటలకులోగా వేడినీళ్ల స్నానం. అఱగిద్దెడు బియ్యపుసన్ననూకల పలచటి జావ. అఱసోలెడు మజ్జిగ (ఆవుదేనా సరే? గేదెదేనా సరే)- ఇంతే, మధ్యాహ్నం యేదో మీతోపాటు భోజనం, 3 1/2 గంటలకు సుమారున బార్లీగింజలజావ, రాత్రి మీతోపాటుగా కొంత ఆలస్యంగాకాక నల్లమందుకనక 7 గంటలకు భోజనం (ఇది ప్రధానం కాదు) నిమ్మకాయంత గోధుమపిండితో చేసిన చపాతీ, అఱసోలెడు ఆవుపాలు : బస్ ఇంతే. యీసదుపాయం యెవరికిగాని అంతగా భారంకాదనే నేను అనుకుంటాను. కాని యింతకంటె అధికమైన సదుపాయం కొన్నిచోట్ల మిక్కిలి చిక్కుగా వుండేది వకటివుంది. అది ఆవలీవలికివెళ్లే సదుపాయం. నాపడకగదికి పదిగజాలలో ఆ సదుపాయం కుదరాలి. (అవసర మవుతుందేమో అని యిట్లు కోరడంగాని యిది యెల్లప్పుడూ అవసరంకాదు. కాని మనిషికివున్నది పుష్టికదా) నాకువున్నవ్యాధి మూత్రవ్యాధి అని లోగడనే వ్రాశానుగదా. అది అప్పడప్పుడు ప్రకోపిస్తూ వుంటుంది. ఇది వార్ధక్యాతిశయంచేత యిప్పుడు మఱింత లోకువచేసి తఱుచు ప్రకోపాన్ని చూపిస్తూవుందిగాని అసలు నన్ను యిది ఆశ్రయించేమో నలభై అయిదేళ్లు దాటవచ్చింది. యిది కల్పితమని తమరభిప్రాయపడి విమర్శనకు వుపక్రమిస్తారేమో? గ్రంథస్థంగావున్న యీకింది పధ్యాలు చిత్తగించండని ప్రార్ధిస్తాను.

“మ. పదిగా దిర్వది గాద యీరుజ ననున్ బాధింపఁగాఁ జొచ్చి న
      ల్వదిపై నాలుగుదాఁటె వత్సరము; లీపాపిష్టరోగాన కే
      నెద నొక్కించుక చోటొసంగియసుమా? యెట్లెట్లొ వర్తింతు నేఁ
      డిది నాకున్ భరియింప రాద యిఁక నీవే దిక్కు కామేశ్వరీ”