పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/464

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

468

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


గారి జీవితకాలములో నేనుమాత్రమే రచించిన కామేశ్వరీశతకములో, “సహాధ్యాయింగా నల తిర్పతిన్ సలిపి" అని యొకపద్యము వ్రాసియున్నాను. కాని ఆశతకముకూడ "తిరుపతి వేంకటీయము" అనియే ప్రకటింపఁబడినది. ఇదిమాత్రము విమర్శకుఁడుగారికి సమన్వితమగునా? ఆయన ప్రత్యేకించి వ్రాసినవియుం గలవు. మచ్చునకొకటి చూపుదును. "తిరుపతిశాస్త్రి తెలుంగుఁజేసె" అని బాలరామాయణ ప్రస్తావనలోనున్నది. ఆ బాలరామాయణముకూడ - "తిరుపతి వేంకటీయమే". ఇదిమాత్రము విమర్శకుఁడిగారి కెట్లు సమన్వయించును? పైఁగా ఆవాక్య మే సీసపద్యమునందున్నదో ఆ సీసపద్యములో తి. వేం. కవు లిర్వురును శ్రీ పోలవరపు జమీన్‌దారుగారి యాస్థానమున నున్నట్లే తెలుపు వాక్యముగూడ నున్నది. ప్రత్యేకించి తి. శా. గారికిఁగల పై సంబంధము వెం. శా. గారికి విమర్శకుఁడుగా రెట్లు లగింపఁజేతురో? ఈ సీసములోని వాక్యము నెట్లో విడఁదీసి, తి. శా. గారికి మాత్రమే సమన్వయించి సమాధానము చెప్పికొందమన్నను బుద్ధచరిత్ర పీఠికలోని యీ క్రిందివాక్యమట్లు చెప్పుకోనీయదే? “అని కోరికొని నాటఁగోలె నా ప్రభువుచేఁ బోషింపఁబడుచు దదాస్థానమంద యుంటిమి". ఎక్కడో వ్యంగ్యమర్యాదచే స్ఫురించెడి ప్రతిఫలనమునకై బోలెఁడు వెక్కిరింపుమాటలను వ్యయమొనర్చిన విమర్శకుఁడు గారికి వాచ్యముగానున్న పైవిషయము మఱియు నసంగతము కావలయును గదా? లేక నేను గూడ శ్రీపోలవరపు జమీన్‌దారుగారి యాస్థానమం దుండి పోషింపఁబడినట్లేమేని యాధారములు చూపఁగలరా? దీనిని గుఱించి దివాకరాస్తమయములో విస్తరించి కలదు గాన వలయువారందుఁ దిలకింపఁగలరు. ఇట్టి బుద్ధిమంతులు బయలుదేరుదు రని నే నించుక గుఱితించియే దానియం దొకింత ప్రస్తుతవిషయము నుట్టంకించితిని. అట్లుచేసినను, "భక్షితే౽పి లశునే న రోగశాంతిః" అను న్యాయము కతన, ప్రయోజనము కనుపట్టనే లేదు. "ఏదో తోఁచినట్లు వెక్కిరించెనే కాని విమర్శకుఁ డిన్ని చూడలే” దని కొందఱనవచ్చును. సమ్మతమేకాని దేనిని విమర్శింప మొదలిడెనో దానింగూడఁ దిన్నగాఁ జూడలేదని ఋజువుచేసితినిగదా? “అవును సత్యమే. ఆయన నేమిచేయమందు"? రనియెదరా? యేమియును జేయవలదు. తరువాయి నరయుఁడు - ఇంతవఱకు, తి. శా. గారి జీవితకాలమున జరిగినరచన లుదాహరింపఁబడినవి. తి. శా. గారి స్వర్గతికిఁ బిమ్మటివికూడ, “ఆరోగ్యకామేశ్వరి”, “ఆరోగ్యభాస్కరము", "మృత్యుంజయస్తవము" లోనైన పద్యములును, కొన్నివచనములును వేం. శా. గారి వున్నవి. వానినన్నిటిని ఉభయ కర్తృకములుగనే షష్టిపూర్తి కమిటీవారు ప్రచురించుచున్నారుగదా! అందలి పద్యముల కుభయకర్తృ మెట్టుమనవిమర్శకబుధుఁడుగారికి సంగతమయ్యెడిని? 'బొబ్బిలిపట్టాభిషేకము' గూడఁ దిరుపతి వేంకటీయమే. ఇవియన్నియు విమర్శకునకు నసంగతములే యని తేలినది.