పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

436

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

తనంతట దానై వకణ్ణి వెక్కిరించడానికి యెవడున్నూ తలపెట్టనే కూడదు. తనమీద కెవడేనావస్తే అప్పుడు వాడాక్షేపించిన ఆక్షేపణలకు సమాధానాలు వ్రాయడాని కెవరున్నూ గర్హించరు. యీచెప్పేసమాధానాలు నిలుస్తాయా పరమసంతోషం; నిలకవషోతాయా, అప్పుడుకూడా వీణ్ణంతగా లోకులు నిందించరు. వీలైనంతలో ఆత్మరక్షణానికి ప్రయత్నించడం ప్రతివానికిన్నీ విధి. దానిలో కృతార్థత్వం కలిగితే కలుగుతుంది. లేకపోతే లేదు. దానికెవ్వరున్నూ ఆక్షేపించరు. పనిలేనిపాటగా వకరిని వెక్కిరించడానికి మొదలెట్టి బోల్తాపడితేమాత్రం "చచ్చినచా”. వన్నట్లవకమానదు. కాబట్టి నిజమైన విమర్శకులను గూర్చికాదు. గాని విమర్శకాపశదులైన వాళ్లనుగూర్చి "వెఱ్ఱినాయనలారా! మీరెవళ్లని వెక్కిరించినా జాగ్రత్తగా వెక్కిరించండి నూఱు వెక్కిరించాం కదా, అందులో వకటేనా నిలవదా అని మాత్రం పెట్టుకోకండి, మీ వెక్కిరింపులలో యేవకటి గాని అఱగాని, పాతికగాని, పేలిపోయినా, అది మీకు పూర్తిగా అవమానాన్ని కలిగించేదే అని తెలుసుకోండి" అని బోధింఛి గాఢంగా మందలించవలసివుంది. యింతమాత్రానికి వాళ్లు వెనక తగ్గుతారా అంటారా అదివేఱు. మన కృత్యం మనం చేసుకుంటే తరవాత యేమైనా మనకు చింతవుండదు.

“కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన” కదా? మొత్తం తేలినసారం, కవిని వారించడానికి వల్లకాదు గాని, విమర్శకుణ్ణి వారించడానికి అవకాశంవుందన్నది. ముఖ్యాంశం యిదే అయినా యేదో కొంత దీనికి సంబంధించిన యితరాంశం రాయడంచేత గ్రంథం పెరిగింది. -

అయితే యేలాంటి చేతకానివాడైనా విమర్శకుఁడంటూ వకడుండటంవల్ల చాలా లోకానికి ప్రయోజనంఉంటుందని కొందఱంటారు. కొంతవఱకు యిదిన్నీ సత్యమే. యేమంటారా? “నాపృష్టః కస్యచిద్ర్భూయాత్" కనుక యేపిచ్చి ప్రశ్నో బయలుదేరితేనేకాని సమాధానం చెప్పవలసి రానేరాదుగా? అవును. అయినప్పటికీ “ప్రతి చిగిలింత మొక్కా చింతచెట్టుతో ఢీకొం" దన్నట్లుండరా దా విమర్శనాలు. యిప్పుడల్లాటి విమర్శన లెన్నో కనబడతాయి. యిందులో కొందఱు యెలాగయితేయేం, మన పేరు పేపరెక్కి ప్రకాశిస్తుంది గదా అని సంతోషించే తరగతివాళ్లే. యేవకళ్లిద్దఱోతప్ప యిప్పుడందఱూ యీతెగలోకే చేరతారని నానిశ్చితాభిప్రాయం. కవిత్వం పిచ్చివంటిది.

విస్తారంగా వ్రాయడ మెందుకుగాని, కవిత్వం చెప్పకపోతే చెప్పేవాణ్ణి అది బాధిస్తుందిగాని, విమర్శనమాత్రం అట్టిదిగాదు. బాగా ఆలోచిస్తే కవిత్వం వక పిచ్చివంటిదనుకొంటాను. పిచ్చివంటిదీకాదు, యేలాంటిదో చెప్పడానికి నాకు