పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/431

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవికన్న విమర్శకుcడికి జాగరూకత ఎక్కువగా ఉండాలి

435


ఆ విమర్శించే పుస్తకం తనకు పెంటమీదకాబోలును దొరికిందని వ్రాశారు. దానివల్లకూడా కొంత నైచ్యం కలగాలనే ఆయన ఉద్దేశం. అంతతోకూడా తృప్తినొందక గ్రంథకర్త దిద్దుకున్న దిద్దుబాటు నొకదాన్నెత్తికొని, ఆ దిద్దుబాటు అసలాయనకు తోచి చేసినది కాదనిన్నీ అది యెవరో చెప్పినమీదట తోచిందనిన్నీ కూడా వ్రాశారు. యేమనుకోవాలో ఆయన వుదారత్వాన్ని సహజగుణం.

యింకొక విషయం మనం గమనించాలి. కవికి దేవుడిచ్చివున్నంత తెల్వితేటలతో మంచో, చెడ్డో - రసమో, అరసమో, గిలకడం తప్పనిసరి. యెందుచేతనంటారా, వాడి కది సహజగుణం కనక. "సహజగుణమేరికేని దుస్త్యజము" కదా! అందుచేత కవిని “నీవెందుకు కవిత్వం చెబుతావు నీకు అది తెలియదు. ఇది తెలియదు” అని మందలించడానికి వల్లకాదు. వ్రాయగా వ్రాయగా యెక్కడో కొద్దో గొప్పో గుణంఉంటే వుండవచ్చు లేకపోతే లేకపోతుంది. "యెవడి పిచ్చి వాడి కానందం” గదా? అందుచేత యేదో రాసుకోవడం వారికితప్పదు. అయితే వాడికేలారాసుకోవడం తప్పదో వీడికల్లాగే విమర్శించడమున్నూ తప్పదనడానికి వీలులేదు. వీడికిది సహజగుణంకాదు. తెచ్చిపెట్టు కొన్నది. “కవులుపుట్టుదురుగాని చేయబడరు" అన్నట్లు విమర్శకులనుగూర్చి అభియుక్తోక్తిలేదు. అందుచేత వాడికీ, వీడికీ యీవిషయంలో పోలిక సహృదయసమ్మతం కాదు. చెప్పే మాటేమిటంటే, కవికన్న విమర్శకుcడికి జాగరూకతయెక్కువగా ఉండాలనే. సహజమైన కవిత్వధారవుండి యితరసామగ్రిలేకపోతే కవికి చాలా దోషాలుతటస్థిస్తాయి. విమర్శకుఁడి విమర్శనలోకూడా అలావుండకూడదు. యెక్కడో, వకటీ అఱావుంటే యేమోకాని అంతకంటే అధికంగావుంటే విమర్శకుణ్ణి పాఠకలోకం క్షమించదనుకుంటాను. యెందుచేతనంటే “తీరి కూర్చున్నమంగలి పిల్లితలగొఱిగే" డన్నట్టు యితనికీ పరిశ్రమ యెందుకంటూ లోకులు గర్హిస్తారని నావూహ. కారణం యిదివఱకే వ్రాశాను. అయినా మళ్లా వ్రాస్తాను.

కవికి కవిత్వంచెప్పుకోవడం తప్పదు. చెప్పడ మనక చెప్పుకోవడమన్నాను. చూచారా కేవలం తనకుమాత్రమే వుపయోగించినా అతని రచనకు వైయర్థ్యంలేదనివాడు సంతోషపడ వచ్చును. విమర్శకుఁడి విషయమట్టిదికాదు. లోకం చూచికూడా వప్పుకోవాలి. విమర్శనం అలావుండకపోతే “వాణ్ణి వెక్కిరించబోయినందుకు మంచిపని జరిగిం"దని లోకులు విమర్శకుఁడికి జరిగినపరాభవానికి సంతోషిస్తారు. కవితప్పులని విమర్శకుఁడెన్ని చూపిస్తాడో, అవతలివాడు తిరగబడ్డప్పుడు అన్నింటినీ నిలుపుకోవాలి. వకటి నిల్పుకోలేక పోయినా విమర్శకుఁడికి అది మహాపరాధమే అవుతుంది. నన్నడిగితిరా, వకమాటచెప్తాను. వెక్కిరించగూడదు. -