పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

412

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ఉత్తమనాయకుడు కనక (ఏకతైవానురాగశ్చే ద్రసాభాసః) ఆ వుద్యమాన్నుంచి విరమించినట్లు సంస్కృతంలో వుంటే, తెలుగులో నన్నయ్యగారు అసలు ఆ ధనుస్సు యెక్కుపెట్టడమే తిలగింజంతగాబోలును తరవాయి వున్నట్టు వ్రాశారు. యిక్కడ నన్నయ్యగారికి కర్ణునియందు ద్వేషం వుందని యెవ్వరూ చెప్పరు. ఫోనీ కృతినాయకుడు రాజరాజనరేంద్రుణ్ణి సంతోషపెట్టే వుద్దేశంతో (రాజరాజ నరేంద్రుడు పాండవ వంశస్థుడనుకొనే పద్ధతిని) ఆలాటిమార్పు చేశాడేమో? - అనుకుంటే భారతకాలంలో వారికి యెవరికో తప్ప కర్ణజన్మ రహస్యం తెలియదుగాని రాజరాజ నరేంద్రుని నాటికి ధర్మరాజాదు లేలాటి పాండవులో కర్ణుడూ ఆలాటి పాండవుడే అనే సిద్ధాంతం సర్వవిదితమేకదా? అందుచేత ఆయీ వూహలు పొసగవు. కర్ణుడుకూడా అభిమానపాత్రుడే అవుతాడు. ఆ శ్లోకాలు నన్నయ్యకు బాగా సమన్వయించలేదు. మనకే సమన్వయించాయి అనుకోవడం బొత్తిగా రుచించనిమాట. భారతప్రతులు నానాదేశాలలో నానారీతిగా ఉపలబ్ధం అవడాన్నిగూర్చి లోకంలో వివాదం లేదుకాబట్టి, నన్నయ్యగారికి లభించిన భారతంలో ఆలాగే (తిలమాత్రం యొక్కుపెట్టడం తరవాయి) వుందనుకోవడమే యుక్తిసహం. అయితే భారతాలు నానావిధంగా యెందుకు వుపలబ్ధం కావలసివచ్చింది? అనే ప్రశ్న ఒకటి యిక్కడ ప్రస్తుతమవుతూవుంది. యిది పెద్ద ప్రశ్న దీన్ని గుఱించి పలువురు వ్రాసేవున్నారు. నేను వ్రాయవలసి వుండదు. భారతం బహు కర్తృకమనే ప్రవాదాన్ని వొప్పకొనేవారికి యీ శంక క్షణంలో నివర్తిస్తుంది. యెవరు వ్రాసినా వారు ఆకాలీనులే అయినా యావత్తు సంగతినీ ప్రత్యక్షంగా చూచి వ్రాయడం అనుభవవిరుద్ధంకదా? కొంత ప్రత్యక్షంగా చూచి వ్రాసినా కొంతేనావిని వ్రాసినభాగం వుండితీరాలి. మత్స్యయంత్రం తెగొట్టినపిమ్మట చాలాసేపటికే వచ్చారో వ్యాసులవారక్కడకి, యింకా మఱునాడే వచ్చారో? ద్రౌపదిని అయిదుగురికి పెళ్లి చేయడం యేలాగ? అనే ధర్మసందేహం తీర్చేటందుకు కదా- వ్యాసులవారు అక్కడికి వచ్చింది. అందుచేత వారు యేలా విన్నారో? ఆలా వ్రాసివుందురు. ప్రత్యక్షంలో చూచినవారెవరేనా అక్కడవుంటే ఆ భాగంలో వ్యాసులవారు వ్రాసినదానికి భిన్నంగా ప్రచారంచేశారేమో? ఆయా విషయం తేలేదికాదు. నా అనుభవాన్ని బట్టి కథకు సంబంధించిన వ్యక్తుల జీవిత కాలంలోనే కథలు తాఱుమాఱవుతూవుండగా కొంతకాలం పాతబడిన తరవాత తాఱుమాఱవడంలో అభ్యంతరం వుండదనియ్యేవే. నేటి పాశ్చాత్యయుద్ధవార్తలు మనకు సరిగా తెలుస్తూన్నాయా? అప్పుడిన్ని సాధనాలు కూడా లేవాయె తత్తథాస్తాం.

మా - "గీరతం" పుట్టి యిప్పటికి సుమారు ముప్పైయ్యేళ్లు కావచ్చింది. గుంటూరుసీమ పుట్టి కూడా యించుమించు అంతే. యిప్పటిదాకా (కొందఱు లోపించినా) ఆ గ్రంథద్వయానికి సంబంధించిన పాత్రలు చాలా వఱకు సజీవులే. యిట్టి స్థితిలో