పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

391


మాటలవల్ల వచ్చే చిక్కంతగా లేదుగాని జిలిబిలిపదాల కవిత్వమంతా నాసొత్తుగానూ, సమాసభూయిష్టమంతా అతని సొత్తుగానూ జమకట్టుకొనేవారిని మాత్రమే నేను సాంజలి బంధంగా “నాయనలారా! మీరు ప్రమాదపడుతూ వున్నా"రని విన్నవింపవలసి వచ్చింది. యీ విషయమే అతని జీవితచరిత్రలో యెత్తుకొని కొంత వ్రాశాను. ఆలా అనుకొనే మాటలవల్ల నాకే యెక్కువ లాభం కలుగుతుందని, నేనే కాదు కవితాసర్వస్వవేదులందఱూ ఒప్పుకుంటారు. కాని అది అంతా సత్యేతరమవడంచేత అంగీకరించడానికి వీలులేక యథార్థం తెలిపి అతని ప్రత్యేకరచనచేత దాన్ని నిరూపించవలసి వచ్చింది. కవిత్వమంటే యేవో నాలుగు సమాసాలు కూర్చడమే పరమావధిగా కలదికాదు. "సాధ్యోహిరసోయథాతథం కవిభిః” వున్నంతలో వోపిక తెచ్చుకుని వ్రాశాను. యిందులో తిరుపతిశాస్త్రినిగూర్చి 'మావాడు' కూడా వదులుకొన్న తరగతిలోనివి కదా? అట్టిస్థితిలో నేను వాటిని వాడడానిక్కారణం మామా సంభాషణ యేలా వుండేదో దాని స్వరూపాన్ని క్రొత్తవాళ్లకి తెల్పడానికే కాని అన్యంకాదు. మా విద్యార్థిదశనాటికింకా దేశం యింతటి మహోన్నతస్థితికి రాలేదు, యీనాటి నాగరికత వగయిరాలు యితరుల విషయం వ్రాయడంలో యేంచిక్కు వస్తుందో అనే శంకతో పనివున్నది కాదు కనక పాటించలేదు. 68 వత్సరాల వయస్సులో వున్న నన్ను యిప్పుడుకూడా తి. శా. అన్న మత్సమానవయస్కుడో లేక యేస్వల్పమో పెద్దో అయిన సుందరరామశాస్త్రి 'యేమిరా’ అనేపిలుస్తాడు. నేనున్నూ ఆలాగే పిలుస్తాను. మా రోజులుమట్టుకు యీలాటి నాగరికత తోటే వెడితే మాకు సంతోషం. యిదే యిప్పటి నాగరికులను గూర్చినదయితే “లీగల్"గా తప్పుగా పరిణమిస్తుంది. సందేహంలేదు.

వకటి రాయడం మఱిచాను. యిటీవల వ్రాసిన తిరుపతిశాస్త్రి జాతకచక్రాన్నిబట్టి చూస్తే గురుఁడు వృషభంలో వుండడంవల్ల నా జాతకంలో మిథునంలో వుండడంచేత అతడు నాకన్న కొంచెం మాసాలో దినాలో పెద్ద కావలసివస్తుందేమో? యీ సంశయం యింతదాకా వ్యాసం వ్రాశాక తట్టింది. లేదా వక్రగతిచేత ఆలా తటస్థించిందా? అది కూడా గురుణ్ణి అంతదూరం లాగదు. అయినా యీకాకదంతపరీక్ష యిప్పుడెందుకు? అంతో యింతో నాకన్న వయస్సులో మాత్రం అతడు చిన్నవాడే.


★ ★ ★