పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/363

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నేనూ-మా తిరుపతి శాస్త్రుల్లూ

367


ఘృతసూపసమన్వితమ్” వంటిది అతని కవిత్వంలో మచ్చుకు కూడా వుండదు. నడవడిలోమాత్రం కొంతేనా కనపడుతుంది. అభ్యాసకాలంలో యెవరికేనా లోపాలు వుండడమున్నూ, యెవరో సవరించడమున్నూ తప్పనిదే. దాన్నే “కావ్యజ్ఞ శిక్షయాభ్యాసః" అని లాక్షణికులు వాక్రుచ్చారు. ఆ పరిశ్రమ నేఁటి బి. యల్. పరీక్షలో కృతార్థులైనవారు “అడ్వకేటు" పదవికి కృషిచేయడం వంటిది. ఆలా కృషిచేయనివారిలో కూడా పూర్వం భాష్యమయ్యంగారు మొదలైన మహామహులున్నారు. యితఁడు వారిలోవాఁడు కాఁడు. నేఁటి "అడ్వకేట్ల" తరగతిలోవాఁడు. కొంత వయస్సు అతీతమైనపిమ్మట కవిత కారంభించినా యితని కవిత "బలా దాకృష్యమాణా" కాదు, ముమ్మాటికీ కాదు. వయస్సతీతం కావడానికి వేఱు, దాన్ని వ్రాస్తాను కాని పలువురు విశ్వసించరు. జాతకనమ్మిక కలవారు విధిగా విశ్వసిస్తారు.

యివటూరి అయ్యన్నగారు పూర్వకాలపు ప్లీడరు వకరు వుండేవారు. ఆయన యింజరం అనే బ్రాహ్మణాగ్రహారంలో స్కూలుమాస్టరుగా వుండేవారు. అప్పటికి పెళ్లికాలేదు ఆయనకి. ఎవరేనా "అయ్యా! మీరింకా పెళ్లి చేసుకోలేదేమి, యీపాటికి పెళ్లిచేసుకోరాదా?" అని ఆప్తులు ప్రశ్నించి ప్రోత్సాహపఱిస్తే ఆయన యేంచెప్పేవారంటే “యిదిగో యిప్పుడు నా జాతకంలో కుజమహాదశ జరుగుతూ వుంది. వచ్చేవత్సరం కాక ఆవచ్చే పైవత్సరంలో రాహుదశ ప్రవేశిస్తుంది. అప్పడు నాకు వివాహాది సమస్త వైభవాలూ వక్కమాటుగా పడతాయి. ఆ రాహువు ఆలాటివాఁడు. మిథునరాహువు" అని చెప్పేవారఁట. తుదకు రాహువు వచ్చాఁడు, అన్నట్టే జరిగింది. ఆయన్ని మేం బాగా యెఱుఁగుదుము. ఆయన భార్య సాక్షాత్తూ మహాలక్ష్మీ అవతారమే. ఆ పతివ్రతాత్వం వర్ణనీయం. దాన్ని యిప్పుడు అభినందించదు లోకం. శాంతం, పాపం! నా జాతకానికి కూడా రాహువు మిథునరాహువే. ఆ అయ్యన్నగారు నా జాతకంచూచి ఆలాగే యోగిస్తాఁడని చెప్పడం సందర్భంలో వెనక నేను వింజరంలో విన్నసంగతుల యాథార్థ్యాన్ని ఆయనముఖతః కూడా వినికాని వూరికే నమ్మి యిందు వ్రాయలేదు.

చెప్పొచ్చే దేమిటంటే? తిరుపతిశాస్త్రి మహాకవి కావలసినవాఁడై జన్మించినప్పటికీ సుమారు పద్దెనిమిదేళ్లదాఁకా ఆ కవిత్వానికి కారకత్వంగల గ్రహదశ రాలేదనిన్నీ అప్పుడు వచ్చిందనిన్నీ, ఆ సమయానికి యేదో బాహ్యకారణంకూడా వుండాలి కనక, అంతకు ముందే యేకొంచెమో అల్లుతూవున్న నాతో స్నేహం కలిగిందనిన్నీ అనుకోవాలి. సహజ కవి అతఁడు కాఁడనే అర్థం యిచ్చే మాటలు విమర్శనాదూరములు. నాకంటే అతఁడు యెక్కువ పండితుఁడనేవిషయం యేలాటిదేనా నేనుత్తరించతగ్గది కాదు. దానికోసం లోకం