పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెనకటి పండితులు

297


వెళ్లవలసి వచ్చేదేమో? అయితే బయలుదేరిన రోజున వొక బస్తా బియ్యానికేనా చావు లేదుగదా? వీట్లని చేన్లుగారే మోసుకునేవారా? అంటారేమో? వారెందుకు మోసుకోవాలి? కూడా శిష్యులున్నారుగదా బోలెడుమంది. బస్తా కాదు యెన్నిబస్తాలేనా మోస్తారు. ఆదృశ్యం నేనైతే చూడలేదుగాని చూడవలసిన దృశ్యం మాత్రం అవును. పండితుఁడైన వాఁడికి నెత్తిమీఁద తట్టతలపాగా తగుల్చుకొని భృతకోపాధ్యాయత్వాన్ని ఆచరించడంకంటె యాయవారం యెత్తుకోవడమే శోభస్కరంగా వుండేదేమో? అప్పటి కాలంలో, యెవ్వరో అలాంటి మహనీయులు అవలంబించే ఆ వృత్తిని యిప్పుడు బడుద్దాయులందఱూ అవలంబించారు. తత్తధాస్తాం. ఈ కాలపు ఉపాధ్యాయత్వమంటారా? శ్లో. అర్థానా మార్టనే దుఃఖ మార్జితానాంచ రక్షణే. అనే శ్లోకార్థానికి సంబంధించి వుంటుంది. పూర్వప్పండితులు వీట్లని నిరసిస్తారని చెప్పడంతో అవసరమే లేదు. యీగతి “డిగ్రీలు" సంపాదించి ఆర్జించుకొన్న వుపాధ్యాయత్వానికి సంబంధించినది- పూర్వప్పండితులలో ఎవరో తప్ప దీనికి ఆమోదించేవారు కారని వ్రాసే వున్నాను. యేనుగులను పట్టుకొని తీసుకువచ్చేవాళ్లు వాట్లకి మొట్టమొదట నల్లమందు అభ్యాసం చేస్తారనిన్నీ దానికి అలవాటు పడ్డాక దానికోసం అవి స్వాధీనపడి వాళ్లకి లొంగిపోయి “దాసోహం” అంటాయనిన్నీ చెప్పఁగా వినడం. అలాగే పూర్వప్పండితులలో యేకొందఱో భృతకానికి అలవాటుపడిదీర్షా యుర్ధాయం పట్టడంవల్ల జీవితకాలంలోనే ఆనల్లమందు ప్రదాతలచేత పాఠశాలనుండి తొలఁగింపఁ బడవలసి వచ్చినప్పుడు యెంతో దైన్యానికి గుఱికావలసి రావడం అందఱూ యెఱిఁగిందే కనక విస్తరించేది లేదు. (యీ దైన్యం అనుభవించినవారిని పేర్కోవలసివస్తే చాలా విస్తరిస్తుంది వ్యాసం) భృతకో పాధ్యాయత్వానికే కాదు. మహారాజాస్థానంలో పండితపదవి కూడా ఆకాలప్పండితులలో చాలామంది అంగీకరించడం అరుదుగానే వుండేది. కొవ్వూరు గోపాలశాస్త్రుల్లుగారినీ, భాగవతుల హరిశాస్త్రుల్లుగారినీ విజయనగరం మహారాజులుంగారు కాశీనుంచి పెద్ద ప్రయత్నంచేసి తీసుకువచ్చారని తజ్ఞుల వల్లవిన్నాను. విజయనగర సంస్థానంలో పండితులకు వుండేగౌరవం అసాధారణం. కొందఱు జమీందారులు పండితుల్ని గౌరవవేతనాలిచ్చి పోషించడమైతే వుంటుందిగాని అది మనోవర్తి (భరణం) మాదిరిని వారు అనుభవిస్తూ వుండడంమట్టుకేగాని వారి గోష్ఠికి ఆ జమీందారులు అవకాశం యివ్వడం వుండనే వుండదు. విజయనగరప్పద్ధతి అలాటిదికాదు. ప్రతిదినమూ పండితగోష్ఠి కంటూ కొంతటైము రిజర్వుచేసి వుంచి ఆ టైముకు రాజుగారికి యితర తొందర పనులేవేనా వున్నట్టయితే ఆ పండితులసభకు వచ్చి నమస్కారాది సంభావనలు జరిపి ఆశీర్వచనాన్ని పుచ్చుకొని వారి ఆజ్ఞను పొంది ఆవలి రాచకార్యానికి వెళ్లడం ఆచారం. ఈ ఆచారం