పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

296

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


చేయడం మొదలుపెట్టారని విన్నాను. “చామర్లకోటలోఁ జదివితి రాఘవాచార్యు సన్నిధిని" అనే రాఘవాచార్యులవారు యీ చేన్లుగారి శిష్యులే. అయితే యాయవారం మాత్రం ప్రతిగ్రహణంకాదా! అని కొందఱు అనుకుంటారేమో? యేదో విధానాన్ని కుటుంబపోషణ జరగాలి కనక అప్పటి పండితులు, “యదహ్నాత్కురుతే పాపం" గా ఆ యీ వృత్తిని ఆశ్రయించడానికి సమ్మతించేవారు. (కుక్కదానం పట్టి కుటుంబాన్ని పోషించమని సామెత.) బులుసు అచ్చయ్యగారు నప్రతిగ్రహీతలుగా (పదేసి వేలు, యిరవైయేసి వేలు ఆయాచితంగా యింటికి స్వయంగా పట్టుకువచ్చి యిచ్చే దాతలు వుండఁగా కూడాను) వుండి వుండి ఆఖరికి జన్మానికల్లా శివరాత్రిగా వొక్కమాటు కాఁబోలు హైదరాబాదా దివాన్ చందోలాలాగారి వద్ద వొక నిలువు చెంబెఁడు పూల వరహాలు పరిగ్రహించారని వినడం. అదేనా యెందుకు తటస్థించిందంటారు? భార్య వీథిగుమ్మం అలుకుతూ వుండఁగా అచ్చయ్యగారు యీవాళ యింట్లో శాకపాకాలేమిటి అని ప్రశ్నించారనిన్నీ దానిమీఁద ఆ మహాయిల్లాలు హేలగా “యేమున్నాయి, యిత్యర్థల పులుసూ, యితిభావల కూరా" అన్నదనిన్నీ అది విని ఆవిడహృదయం ధనాశా విద్ధంగా వున్నట్టు (పరేంగితజ్ఞానఫలాహి బుద్ధయః) గ్రహించి సదరు అచ్చయ్యగారు (యీయనకీ వేదశాస్త్రాలు యావత్తూ వచ్చివుండడంచేత యే పేరూ చివర తగుల్చుకోడానికి వీలుగాక పుట్టు పేరుతోనే వుండిపోయారని చెప్పకుంటారు) నీవు ఎంతసొమ్ము తెచ్చియిస్తే సంతోషిస్తావో ఆసంగతి మళ్లామళ్లా కాక ఒకమాటే విధిస్తే తెచ్చియిస్తానని ప్రతిజ్ఞచేశారనిన్నీ ఆ అమాయకపు యిల్లాలు ఆ సమయానికి తన చేతిలోవున్న నిలువుచెంబు (యా ఖర్వేణపిబతి తస్యైఖర్వః అని వేదం) చూపి దీఁనెడు వరహాలు కావాలందనిన్నీ తరువాత ఆ చెంబు చేత పుచ్చుకొని ఆపూటే ప్రయాణమై హైదరాబాదులో అన్ని వరహాలూ దివాన్‌జీగారివద్ద పరిగ్రహించి తెచ్చియిచ్చి ఆవిడకి సంతుష్టిని కలిగించారనీ చెప్పుకుంటారు. అచ్చయ్యగారు అంతకంటె అధికంపుచ్చుకోక పోవడంచేతంగాని చందోలాలాగారి యీవి అంతమాత్రంతో ఆగేదికాదు. యిచ్చేవాఁడు దొరికాఁడుకదా అని యావత్తుకూ ఔపాసన పట్టేవాఁడైతే అచ్చయ్యగారు చరిత్రపురుషుఁడెలా అవుతాఁడు? అస్మదాదులకు వారిని గుఱించి ముచ్చటించుకొనే అధికారం కూడా లేదనిపిస్తుంది నాకు. చేన్లు గారి యాయవారంలో అచ్చయ్యగారు అవాంతరంగా వచ్చి తగిలారు. ఆయన యాయవారానికి బయలుదేరారంటే? యేమన్నమాట? సాక్షాత్తు ఈశ్వరుఁడు (అణిమాద్యష్టైశ్వర్యోపేతుఁడు) వెండికొండ గుహలో నివసించేవాఁడు బంగారుకొండ చేతులో కలవాఁడు ప్రత్యక్షమైనాcడన్నమాటేకదా? యిఁక చూడండీ! కుంచాలక్కుంచాలతో కమ్మయిల్లాండ్రు గుమ్మరించేవారు బియ్యాన్ని అవి సమాప్తమయే దాఁకా ఆయన మళ్లా బయలుదేఱేవారే కారు. బహుశః వారానికోసారి