పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వికటవిమర్శనం

287

శ్లో. "నిశమ్యదేవానుచరస్యవాచం” (12 శ్లో)

యీ శ్లోకంలో “దేవానుచరస్య" అనేపదం యీశ్వరునికి నవుకరయిన సింహము అనే అర్థంలో కాళిదాసుచేత ప్రయోగింపఁబడింది. వ్యాఖ్యాతకూడా అలాగే వ్రాశాcడు. కాని యీసింహము నందినీ ధేనువుచేత కల్పించcబడ్డ సింహంగాని ఈశ్వరుని నౌకరుకాదు. దిలీపుని హృదయాన్ని పరీక్షించడానికి తానేమో ఈశ్వర భృత్యుణ్ణనిన్నీ తనపేరు కుంభోదరుఁడనిన్నీ తనకు యీ సింహాకారాన్ని యీశ్వరుఁడే అనుగ్రహించాఁడనిన్నీ మాయమాటలు చెప్పినది నందినీధేనువుచేత కల్పితమైన సింహమేకాని యీశ్వరభృత్యుఁడుకాఁడు. ప్రస్తుతవాక్యం కవివాక్యంగాని మఱివకటి కాదు. కవిచెప్పే వాక్యం యథార్థబోధకంగా వుండవలసింది. దిలీపునికి యిది కల్పిత సింహమని తెలియక పోవచ్చును గాని కవికి తెలియకపోవడం యెలాగ? యిది యిదివఱలో చేసిన శంకలవంటిది కాదని విజ్ఞులు కొన్ని వున్నప్పటికీ గ్రంథవిస్తర భయంచేత వాట్లను చూపలేదు. తృతీయసర్గలో,

శ్లో. "శ్రుతస్య యాయాదయ మంతమర్భకః"

అని రఘుమహారాజును గూర్చి గొప్ప విద్వాంసుఁడవుతాఁడనే అభిప్రాయంతోటే వ్రాసినప్పటికీ యిందులో మొదటిమాట వదిలిపెట్టి చదువుకుంటే అశ్లీలార్థానికి తోవతీస్తూవుంది. నామకరణ సందర్భంలో యీలాటివాక్యం ప్రయోగించడం యుక్తం కాదనుకుంటాను.

శ్లో. “మహోక్షతాం వత్సతరః స్పృశ న్నివ ద్విపేంద్రభావం కలభః శ్రయన్నివ" (32 శ్లో)

యీ శ్లోకంలో రెండు పోలికలున్నూ పశుత్వజాతికే సంబంధించినవి చెప్పడంచేత రఘుమహారాజునకు పశుప్రాయత్వం ధ్వనిస్తూవుందా? లేదా? అంటే కాళిదాసుగాని వేఱొకరుగాని చెప్పే జవాబేమిటో? దిలీపునకు పశుప్రాయత్వాన్ని ఆపాదించే ధ్వనివిషయం కొంత లోఁగడ కనపఱచివుండడంచేత పశుప్రాయుఁడి కొడుకు అట్టివాఁడే అయినాఁ డనుకోవడంకూడా కొంత యుక్తిసహంగా వుంటుందో లేదో? విజ్ఞులు విచారించంగలరు. - శ్లో "అథా౽స్యగోదానవిధేరనంతరం" (33 శ్లో) యిందులో, అస్య-గోదానవిధేః అనడంచేత అమంగళార్థస్ఫూర్తి కలుగుతూవుంది. వివాహానికి పూర్వం గోదానవిధి జరగడం శాస్త్ర సమ్మతమే అయినా అంతమాత్రంచేత అది యీ అమంగళార్ధాన్ని వారించలేదు. దీన్ని వారించవలసివస్తే సహృదయత్వం వక్కటే, "అన్యథాశరణం నాస్తి" అదివుండేయడల యిట్టి ఆక్షేపణలకు వుపక్రమించడమే తటస్థింపదు కనక విస్తరించనక్కఱలేదు.