పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/281

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వికటవిమర్శనం

285

శ్లో. "కింతు వధ్వాం తవైతస్యాం" (64 శ్లో)

యీశ్లోకంలో దిలీపుఁడు తన భార్య అయిన సుదక్షిణాదేవిని తన పురోహితుఁడైన వసిష్ఠమహామునికి కోడలుగా నిరూపించి మాట్లాడుతున్నాఁడు. దీనివల్ల వచ్చే దుర్వ్యంగ్యం యెంతోవుంది. దిలీపుని తల్లి వసిష్ఠుఁడికే దిలీపుణ్ణి కన్నదనే ధ్వని దుర్నివారంకదా! అక్కడక్కడ రాజకుటుంబాలకు సంతానలోపం తటస్థించినప్పుడు పురోహితులద్వారాగా ధర్మసంతానం కలిగించుకోవడం ప్రస్తుతధ్వనికి సహకారి కావడం తోడవుతుంది కూడాను. విచారిస్తే యింకో దురర్థంకూడా తీయవచ్చును. వధూశబ్దానికి కోడలనే అర్ధమే కాకుండా కేవలము స్త్రీ అని. అర్థం చెప్పేటట్టయితే నీ భార్య అని తేలుతుంది. పురుష వాచక శబ్దానికి స్త్రీ వాచకం అంటే స్త్రీ పర్యాయంతో సంబంధం కలిపినప్పుడు భార్య అనే వస్తుందిగాని మఱివకలాగు రాదు. యిది ప్రసిద్ధ విషయము గనక వుదాహరణా లక్కఱలేదు. ఆ యీ దురర్ధాలన్నీ కాళిదాసు లోపాలో? కావో? సహృదయులు విచారింపఁగలరు.

శ్లో. "...సుప్తమీన ఇవహ్రదః" (73 శ్లో)

యీ శ్లోకంలో కన్నులు మూసుకొని ధ్యానిస్తూవున్న వసిష్ఠుణ్ణి నిద్రపోతూవున్న చేఁపలు కల సరస్సుతో కాళిదాసు పోల్చివున్నాఁడు. వసిష్ఠుని నేత్రాలకున్నూ చేఁపలకున్నూ వుపమానం ధ్వనిస్తూవుంది. స్త్రీ నేత్రాలకు చేఁపలతో సామ్యం ప్రసిద్ధంగాని పురుషనేత్రాలకు ప్రసిద్ధంకాదు కనక యిది ఆక్షేపణీయంకాకపోదు. మఱిన్నీ చెడుకంపుతోవుండే చేఁపలతో పరమ పవిత్రంగా వుండే ఋషి నేత్రాలకు సామ్యం చెప్పడం బొత్తిగా వొప్పుకో తగ్గదికాదు. సహృదయులు విచారింతురుగాక.

శ్లో. "పురాశక్ర ముపస్థాయ" (75 శ్లో)

యీ శ్లోకంలో "ఉపస్థాయ" అనేది ల్యప్ప్రత్యయాంతంగా కాళిదాసు ప్రయోగించి వున్నాఁడు. ఆ పక్షమందు అర్ధం “ఉపాసనచేసి" అని వస్తుంది. అందులో ఆక్షేపణ లేశమున్నూ వుండదు. కాని అది అకారాంత శబ్దమనుకోవడానికి కూడా అవకాశం వుండడంవల్ల అల్లీల రూపమైన దోషం తటస్థిస్తూవుంది. "రథోపస్థ ఉపావిశత్" ఇత్యాది ప్రయోగాలు ప్రత్యేకించినవే వున్నప్పటికీ ఆక్షేపకులు అంగీకరించమంటారు. పైఁగా ఆ ప్రయోగాలకి కూడా యిదే ఆక్షేపణంటారు. దీన్నిగూర్చి కూడా సహృదయులు ఆలోచించవలసిందే. దీనితోపాటు 87వ శ్లోకంలో వున్న “ఉపస్థితేయం కళ్యాణీ" అనేశ్లోకంలో యత్కించి న్న్యూనంగావున్న శబ్దశ్రవణాన్ని గూర్చిన ఆక్షేపణకూడా ఆలోచించ తగ్గదే అని నాకు తోస్తుంది.