పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/239

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

243


కవిసన్మానం

స్వదేశోద్యమం ప్రారంభమైనాక మన ఆంధ్రదేశంలోనే కాదు; యితర దేశాలలో కూడా కవులకు సన్మానాలు జరుగుతూవున్న సంగతి అందఱూ యెఱిఁగిందే. ఆ సన్మాన సందర్భంలో ఆయా కవులకు కొన్ని బిరుదాలుకూడా యివ్వడం కొన్నిచోట్ల జరుగుతూ వుంది. ఆ బిరుదాలు పూర్వకాలంలో వుండే బిరుదాలను అనుసరించే వుంటూ వున్నాయి గాని వాట్లను వ్యతిరేకించి మాత్రం వుండడంలేదు. ఇట్టిస్థితిలో 6వ అక్టోబరు 1937 సం!! ఆంధ్ర వారపత్రికలో "కుక్కలవల్ల లాభమేమిటి?" అనే శీర్షిక కింద కొన్ని మాటలు కుక్కలనుగూర్చి వ్రాస్తూ ఆ వ్యాసకర్త బుద్ధి పూర్వకంగా కాదేమో? కాని కవులకవిత్వానికిన్నీ కుక్కల అఱపులకున్నూ అసకృదావృత్తిగా పోలికను వుపపాదిస్తూ జనరల్‌గా కవుల నందఱిని కుక్కలనుచేసి వదలిపెట్టారు. “న దుఃఖం పంచభిస్సహ" కనక సర్వసామాన్యంగా వున్న వ్యాసకర్తగారి వుల్లేఖానికి యెవరుగాని విచారింపవలసి వుండనప్పుడు ఆ కుక్కల్లో వకకుక్క కలగఁజేసుకొని యేవో రెండఱపులు అఱవడం అవసరమే అయినను అసలు నేను అరవజాతిలో వాణ్ణి కావడంచేత కొంచెం అఱిచినందుకు వ్యాసకర్తగారు నన్ను క్షమించవలసిందని ప్రార్థిస్తాను. వ్యాసకర్తగారి వ్యాసంలో వున్న కొన్నిమాటలు మచ్చుచూపుతాను.

1) ఓ కుక్కకు యేం దురద పట్టిందో? . . మొదలు పెట్టింది కవిత్వం

2) అందులోనుంచి జంటకవివచ్చి అందుకుంది రెండోపాదం మఱో కుక్క

3) చివరపాదంలో పేరుతో సహా ఝమాయించి కొట్టింది పద్యపాదాలన్నీ

4) మఱో శ్వానకవితల్లజుఁడు బయలుదేరాఁడు తీర్పుదిద్దడానికి.

5) ఆపళంగా వేఁడెక్కింది కవిత్వవాతావరణం. వీటి దుంపతెగా! వూరుకుంటయ్యా? పంచరత్నాలు, నవరత్నాలు వ్రాసుకొచ్చినయి.

6) అదికాదండీ కవిత్వం ప్రపంచానికి అంత అవసరమే అయి...

వోహో పొరపాటు చేస్తూన్నానే! వ్యాసకర్తగారి మాటలు చూపడానికి మొదలుపెట్టాను. వ్యాసమంతా యీ కుక్కల అఱపును కవిత్వంతో అభేదంగా సమర్ధించడంతోటే