పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


ప్రవర్తించింది. వుదాహరించవలసి వస్తే నాలుగుకాలాలున్నూ వుదాహరించవలసి వస్తుంది గదా! అందుచేత ఆ పని పనికిరాదు. యీలా వ్రాయడం యేదో ప్రౌఢత్వం అనే తాత్పర్యంతో వ్యాసకర్తగారు వ్రాసివుంటారు కాని యేవ్యక్తినిగాని యే సంఘాన్నికాని మనస్సులో పెట్టుకొని వ్రాసినట్టు నాకు తోఁచదు. "ప్రమాణ మంతఃకరణ ప్రవృత్తయః" ఆపద్ధతిని వ్యాసకర్త వుద్దేశ్యము విమర్శనార్హం కాదు. కాని “శుచిర్విప్రశుచిః కవి" అంటూ వేదందగ్గరనుంచీ పరిశుద్ధపదార్థంగా అంగీకరిస్తూ వున్నకవిజాతిని పరమాపవిత్రమైన కుక్కలనుగా లోకానికి ప్రదర్శించడానికి యేర్పడ్డ యీవ్యాసాన్ని పరిశీలించకుండా పత్రికాప్రవర్తకు లేమని ప్రకటించారో? కొంచెం విచారించవలసి వుంటుంది. కాని వారు మాత్రం ప్రతీవ్యాసాన్ని పరిశీలిస్తూ వుంటారా? గవర్నమెంటువల్ల చిక్కువచ్చే వ్యాసాలే కొన్ని ముందు ప్రచురించి తరవాత చిక్కుతెచ్చుకుంటూ వుండేవి వుంటూ వుంటాయికదా! అందుచేత వారిని అడిగినా ప్రయోజనం లేదు. వ్యాసకర్తగారి వుద్దేశాన్ని గురించే మనలో మనం కొంత చర్చించుకుని చూదాం.

శ్లో. “విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని
     శుని చైవ శ్వపాకేచ పండితా స్సమదర్శినః"

అన్న గీతవాక్యాన్ని బట్టి గోవునూ, కుక్కనూ వకటేరీతిగా చూడడం దోషాపాదకం కాదని తేలడమే కాకుండా పైఁగా విజ్ఞానుల తాత్పర్య మైనట్టుకూడా కనపడుతూవుంది. కనక విజ్ఞానాగ్రేసరులైన వ్యాసకర్తగారు కవులను కుక్కలుగా చిత్రించివుంటారా? బహుశః ఆశ్లోకతాత్పర్యం తక్కువ జంతువును కూడా యెక్కువ జంతువులతోపాటు సమ్మానించడమే కనక,

శ్లో. శ్వాన కుక్కుట మార్జాల పోషకస్తు దినత్రయమ్
    ఇహజన్మని శూద్రస్స్యా చ్చండాలః కోటిజన్మసు.

అనేరకంతో చేరిన కుక్కలకు గౌరవం కలిగించడమే వ్యాసకర్తగారి తాత్పర్యమనుకుంటే ప్రస్తుత కాలానుగుణ్యంగా కూడా వుంటుందిగాని వ్యాసకర్తగారి కొన్నివాక్యాలు దీనికిన్నీ అనుకూలిచండంలేదు. “1) వీటి దుంపా తెగా, 2) వీటితాడు తెగా వీటిని యెట్లా పుట్టించేఁడో? దేముఁడు" ఇత్యాదివాక్యాలు వ్యాసకర్తగారికి కుక్కలను గొప్పచేయాలనే తలఁపున్నదనడానికి వప్పుకోవు. యీ ఘట్టంలో కొన్ని వాక్యాలు కవుల కొంపలకే కాక గాయకుల కొంపలకు కూడా వ్యాసకర్తగారు అగ్గిదాఁకొల్పే వుద్దేశంతో వున్నట్టు కనపడతాయి. వకటి వుదాహరిస్తాను.