పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“నా౽నృషిఃకురుతేకావ్యం"

217


“మరువ దుశీనరేషు జలం" అన్న మాదిరిని సమన్వయించుకోవాలి. ఉశీనరదేశాల్లో నీటి సదుపాయం యేలా వుంటుందని ప్రశ్నిస్తే - మరుప్రదేశంలో వున్నట్టే అని జవాబు. మరుప్రదేశం (అరేబియా యిసుకపఱ్ఱ)లో జలమేలా దుర్లభమో? ఆలాగే ఉశీనరదేశంలోనూ దుర్లభమని ఫలితార్థం. లేదని చెప్పడానికి వుందని జవాబు చెప్పినా ఫలితార్థం లేకపోవడమే పయిశ్లోకం. యథామాతృకంగానే వ్యాసులవా రనువదించి వున్నారని లోఁగడ వ్రాసే వున్నాను. యింతమాత్రంచేత గ్రంథ చోరత్వాన్ని ఆపాదించకూడదు. ఆ విషయం వేదంలో వున్నట్టుగానే వుటంకిస్తే, మఱీ ప్రమాణ ప్రమితంగా వుంటుందని ఆలా చేసి వుంటారు. కొన్ని యత్కించితు మార్పుతోటీ వుంటాయి - చూపుతాను.

శ్లో. “ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతేచ వసతి విజ్ఞానమ్."

యీ శ్లోకం యింతమట్టుకు యథామాతృకంగానూ ఉత్తరార్ధం పదాలు కొంచెం తాఱుమాఱుగా (అర్థం వొకటే) నున్నూ వుపనిషత్తు నుంచే దేవీభాగవతంలో అనువదింపఁబడివుంది. యింకా యిలాటివెన్నో కనపడతాయి. ఇది విషయాంతరం. ఋషుల కవిత్వాలలో కూడా ఎన్నో చమత్కారాలు కనపడతాయనేది వ్యక్తవ్యాంశం,

శ్లో. “మాతామహ మహాశైలం, మహాస్త దపితామహమ్
     కారణం జగతాం వందే కంఠా దుపరి వారణమ్."

ఇదిన్నీ జైమినీ విరచితమే. దీనిలో శబ్ద చమత్కారమే కాదు, అర్థచమత్కారమున్నూ వుంది. దీని పూర్వార్ధంలో మ-హ, అనే అక్షరద్వయం నాలుగుమాట్లు ఆవృత్తమయింది. ఉత్తరార్ధంలో - రణం - ద్విరావృత్త మయింది. అర్థంలోనో? మాతామహుఁడే వున్నాఁడుగాని, ఆ తేజస్సుకు పితామహుఁడు లేఁడఁట! యిదీ యిందులో చమత్కారం. పార్వతీ కల్పిత పుత్రుఁడైన గణపతికి తాత (మాతామహుఁడు) హిమవంతుడు గావచ్చును గాని పితామహుఁడెక్కడ దొరుకుతాడు? శివుడు కూడా యెవరికేనా కొడుకుగా వుండేపక్షంలో గణేశ్వరుఁడికి పితామహుఁడు వుండివుండేవాఁడు. ఈశ్లోకంలో చేస్తే కొన్ని శంకలు చేయవచ్చు. అవి వెఱ్ఱిగా వుంటాయి. ఆ వెఱ్ఱిశంకల స్వరూపం కొంచెం చూపుతాను. సర్వాదిగా వుండే పరశక్తికి హిమవంతుఁడు తండ్రిగా వున్నట్టే, యీశ్వరుడికి కూడా బ్రహ్మ తండ్రి కావచ్చునుగదా? దీనికి పురాణగాథ ఆధారం వుంది. ఆ పక్షంలో మాతామహుడిఁతోపాటు గణపతికి పితామహుడు కూడా వుండవచ్చునే అంటే వినండి. గ్రంథకర్త పరమశివుణ్ణి వుద్దేశించి ఆలా చమత్కరించాcడుగాని శివుని అంశంవల్ల అవతరించిన రుద్రులను కాదంటే సరిపోతుంది. కవి వుద్దేశాన్ని పట్టి వ్యాఖ్యాతలు ప్రవర్తించాలి. వక్తవ్యాంశం కాళిదాసాదుల కవిత్వాలలోనే కాక, చమత్కారాలు ఋషుల