పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/214

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

218

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


కవిత్వాలలో కూడా వుంటాయన్నదే. ఆ యీ శబ్దచిత్రాలుగాని, అర్థచిత్రాలుగాని ఋషులు అంతో యింతో సూచిస్తే యిటీవల వాట్లను తదితర కవులు విస్తరించారనేది పరమార్థం. వొక్క బంధకవిత్వం మాత్రం ఋషుల కవిత్వంలో ఎక్కడా వున్నట్టు తోఁచదు. అక్షరాలు విడcదీయడమూ వొక్కొక్క అక్షరానికి వొక్కొక్క అర్థం చెప్పడమూ వేదంలోనే కనబడుతుంది. అవధూతోపనిషత్తులో

శ్లో. అక్షరత్త్వాత్ (అ) వరేణ్యత్వాత్ (వ)
    ధూతసంసార బంధనాత్ (ధూ)
    తత్త్వమస్యాది లక్ష్యత్వాత్ (త)
    అవధూత ఇతీర్యతే."

అని వొక్కొక్క అక్షరమే విడఁదీసి, వ్యాఖ్యానించే మాదిరిని కూడా చెప్పడం సూచింపఁబడింది. సర్వవేదసార భూతంగా వుండే ఓంకారానికి వ్యాఖ్యానించడం యీ మార్గంలోనే ఋషులు చూపి వున్నారు. అయితే వొక్కొక్కరు వొక్కొక్క మార్గంతొక్కి వ్యాఖ్యానించారు. కాని అందఱూ అక్షరాలు విడదీయడంలో యేకీభవించే వున్నారు. కొందరు శివాధిక్యాన్ని కొందరు కేశవాధిక్యాన్ని - కొందరు శక్త్యాధిక్యాన్ని - యిలా వారి వారి మతాన్ని పోషించుకుంటూ వ్యాఖ్యానించి వున్నారు - దేవీ భాగవతం శక్తి ప్రాధాన్యాన్ని వివరించేదికనక, అందులో యీ విధంగా వుంది.

శా. ఓంకారమ్మున నాద్యకారమున వాచ్యం డయ్యజుం, డయ్యుకా,
     రాంకుం డాతని తండ్రి విష్ణువు, మకారాంకుండు శంభుండు త,
     త్సంకేతమ్మున నుత్తరోత్తరము ప్రాశస్త్యమ్ము వాటిల్లు ని
     శ్శంకన్ బైదగు నర్ధమాత్ర చెలఁగున్ శక్తిస్వరూపమ్ముగన్."

ఆయీ పద్యం సంస్కృతానికి మా (తి. వెం) అనువాదం. ఓంకారంలో (అ. ఉ. మ్) అకారోకారమకారాలు మాత్రమే స్థూలదృష్ట్యా శ్రుతమవుతూ వున్నాయి. మూఁడక్షరాలు ముగ్గురుమూర్తులకూ వాచకాలుగా వుపనిషత్తులు కొన్ని వ్యాఖ్యానించాయి, కొన్ని మాత్రం మూఁడక్షరాలూ కాక, పైని అర్ధమాత్రంకూడా శ్రుతమవుతూందనిన్నీ ఆ అర్ధమాత్రత్రిమూర్త్య తీతమైన శక్తికి వాచకమనిన్నీ వ్యాఖ్యానించాయి. దేవీ భాగవతం తుట్టతుది వ్యాఖ్యానాన్ని బట్టి ప్రవర్తించింది. లలితాదివ్య సహస్రనామాల్లో "అర్ధమాత్రార్థరూపిణీ" అని వుండడం దీన్నిబట్టే అనుకుంటాను. అర్ధమాత్రేమిటో, తత్స్వరూపమేమిటో ఆయి రహస్యం మహా యోగులకేగాని అనుభవంలేని పండితులకు గోచరించేటట్టు లేదు. నేను జగత్ర్పసిద్దులయిన