పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“నా౽నృషిఃకురుతేకావ్యం"

215

శ్లో "సర్పాధినా ధౌషధినాధయుద్ధ క్షుభ్యజ్ఞటా మండల గహ్వరాయ,
     తుభ్యంనమస్సుందరతాండవాయ యస్మి న్నిదం సంచవిచేతి సర్వమ్."

ఆయీ శ్లోకం వేదపాదస్తవంలోది, జైమినిమునికృతం. యిందులో మొట్టమొదటి విశేషణంలో యెంత అందంవుందో సహృదయులు పరిశీలించాలి. ఆ అందం సమాసంలో యిమిడిందంటే, మఱీశాఘ్యం. సాంబమూర్తి జడలో సర్పరాజున్నూ చంద్రుఁడున్నూ యుద్ధం చేస్తున్నారఁట! దానివల్ల బోలెడు గందరగోళం జరుగుతూ వుందఁట! చంద్రుడికీ సర్పానికీ పోట్లాట క్కారణం రాహువు సర్పరూఁపుడే కదా! యెక్కడో వొక్కటికాదు, యిలాటివి యెన్నోశ్లోకాలు ఋషుల కవిత్వాలలో వుంటాయి.

శ్లో. “మృతా మోహమయీ మాతా జాతో బోధమయ స్సుతః,
     సూతక ద్వయసంప్రాప్తౌ కథం సంధ్యా ముపాస్మహే?"

యిది మైత్రేయోపనిషత్తులో వున్న శ్లోకం. కవిత్వం యెంత రసవత్తరంగా వుందో, యెంత అలంకారమయంగా వుందో సహృదయులకి గోచరిస్తుంది. యిప్పటివారు వీట్లని (ఉపనిషత్తులు) నిన్న మొన్నటి వాట్లనుగా చెప్పటం వుంది. వేద ప్రామాణ్యవేత్తలు ఆలాటి కాలనిర్దేశాన్ని వినరు, వింటే చెవులు మూసుకుంటారు కూడాను. “యస్య నిశ్వసితం వేదాః’ అని మన ప్రాచీనులు విశ్వసిస్తారు. పరమాత్మకు ఆదిలేనట్టే, వేదాలక్కూడా ఆదిలేదనియ్యేవే వారి తాత్పర్యం. అట్టి అనాదిభూతమైన వేదంలో వుండే శ్లోకం యెంత మార్గప్రదర్శకంగా వుందో భావికవులకు పరిశీలిద్దాం. అజ్ఞానమయమైన తల్లి చనిపోయిందఁట! (పాపం) పైఁగా జ్ఞానమయమైన పుత్రుఁడుకూడా జన్మించాఁడఁట! ఆలా చూస్తే మృతాశౌచం (మైల) యిలాచూస్తే జాతా శౌచం (పురుడు) యిట్టి స్థితిలో సంధ్యా వందనం చేయడం యేలాగ? (జాతాశౌచ మృతా శౌచాలలో యేది తటస్థించినా, సంధ్యావందనం అసలే చేయకూడదని వొక మతం. అర్ఘ్యప్రదానం మట్టుకు చేసుకోవచ్చునని వొకమతం) సంధ్యావందనానికి నాయకమణి గాయత్రి. అపవిత్రస్థితిలో దాన్ని వుచ్చరించడం మహాదోషం. దాన్ని పురస్కరించుకొని పైశ్లోకార్థం ప్రవర్తించింది. యెంత అందంగా వుందో చూడండి. దీన్ని కవిత్వరీత్యా విచారిస్తే వ్యాసం చాలా పెరుగుతుంది. అజ్ఞానావస్థలోవున్న కర్మఠులకే కాని, జ్ఞానులకు సంధ్యావందనాదికంతో పనిలేదన్నది పిండితార్థం. యింకా బాగా వివరించవలసివస్తే సారాంశం ఈవిధంగా తేలుతుంది. సంధ్యావందనమనేది రోజులో యేవో కొన్ని గడియల కాలంలో మాత్రమే చేసుకొనేది. యితరకాలమంతా సాంసారికగోష్ఠిలో పడి విరామంలేక కొట్టుకొనే వాళ్లకి తరణోపాయంగా యేర్పడింది. జ్ఞానులంటే, సన్యాసులు సర్వదా ఓంకార (సర్వవేదసారభూత మన్నమాట) జపంతో