పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


చెప్పిన అంశాలను ప్రజలు- “విస్సన్న చెప్పినది వేద” మన్నట్టు విశ్వసించే తరగతిలో వుండేవారు. కనక, అప్పటి బోధకులకు ఆట్టే పరిశ్రమ కలిగేది కాదు. ఋషులుగాని, కవులుగాని ఆయా గ్రంథాలలో చెప్పిన భాగాలు చాలాభాగం (మ. ధరణీ మండలి దిర్దిరం దిరిగెఁబాతాళమ్ము ఘూర్ణిల్లెలోనైన వన్నమాట) అతిశయోక్తి కింద జమకట్టుకుంటే“నచ శంకా నచోత్తరం” గాని, ఆంజనేయులు సముద్రం దాఁటి లంకలోకి వెళ్లడమూ, లంకా పట్టణం తగులపెట్టడమూ యివన్నీ అతిశయోక్తులుగానే సమన్వయించుకుంటే

ఉ. సీతయు లేదు రావణుని చెల్లెలు లే, దలరాముఁ డబ్దిలో
    సేతువు గట్టలే, దతని చే దివిజారులు చావలేదు, సా
    కేతపురమ్ములే, దచటఁ గేకయపుత్రియు లేదు సర్వము
    న్నూ తనసృష్టియే యన జనుల్ విని నవ్వుదు రెమ్మొగమ్మునన్.
                                                               (ఇటీవలిచర్య)

కనుక, అన్నీ అతిశయోక్తులే అనుకోవడంకన్న అనాలోచితం వుండదు. కవులు యేపట్నాన్ని గుఱించి వర్ణిస్తారో ఆయా విశేషాలు అక్కడే వుంటాయని చెప్పలేంగాని, మఱోచోటేనా అంతా కాకపోయినా చాలా భాగం వుండి తీరతాయి. (టాజ్మహల్ వగైరా చూ) కాళిదాసాదులకు మార్గదర్శకులు ఋషులు, ఋషులకు మార్గదర్శకాలు వేదాలు. భోజరాజు “మధుమయఫణితీనాం మార్గదర్శీ మహర్షి” అని వాల్మీకిని గూర్చి తన రామాయణ చంపులో కృతజ్ఞత్వాన్ని ప్రకటించి వున్నాడు. సామాన్యదృష్టితో చదువుకునే విద్యార్థులకూ, తత్తుల్యులుగానే వుండే పండితులకూ, కవులకూ, భోజచంపు రుచించినంత సొగసుగా వాల్మీకి కవిత్వం రుచించనిమాట సత్యం. దానిక్కారణం చెప్పవలసివస్తే యింతలో తేలదు. ఋషులు చాలా తేలిక శైలిలో వ్రాస్తారు. తఱచు అనుష్టుపులే వుపయోగిస్తారు. యిటీవలి కవులో ఆలా కాదు. దానికి భిన్నంగా ప్రవర్తిస్తారు. పంపా తీరంలో రాముఁడు వున్నప్పటి రామాయణ కవిత్వం చాలా ప్రౌఢంగా అలంకారభూయిష్టంగా వుంటుంది. కొన్ని భాగాలు పేలపిండి మాదిరిగా వుండేవిన్నీ వుంటాయి. పునరుక్తి భూయిష్ఠంగావుండే భాగాలున్నూ వుంటాయి ఋషుల కవిత్వాలలో అంత మాత్రం చేత ఋషులకు యిమిడ్చి సంగ్రహంగా రచించే శక్తి లేదనుకోవడంకంటే స్థూలదృష్టిత్వం వుండదు. ఆ పద్ధతిని బ్రహ్మసూత్రాలూ, వ్యాకరణ సూత్రాలూ, రచించినవారు ఋషులు కారనుకోవలసి వస్తుంది. అందుచేత ఋషులు సర్వశక్తిసంపన్నులని వొప్పక తప్పదు. వారి రచనలో కవిత్వ విశేషాలన్నీ వుంటాయి. ... "