పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

18

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

జుట్టుకోతప్రకరణం

మా రాజావారివద్ద యీ అర్ధప్రాణాచార్యాధీనాల ఆటలు కూడా సాఁగుతాయా? ఆయన మహా యుక్తిశాలి. చక్కఁగా ఆ శిష్యత్వాన్నుండి తప్పించుకున్నారు చూడండి. లోపల గురువుగారిమీద బోలెండు కోపం వచ్చిఁది. అలా కోపంరావడమే తటస్థిస్తే ఆరోజుల్లో మా రాజావారికి యెవరిమీఁద వచ్చిందో వారిజుట్టు వుండేదికాదు, కాని ఆ జుట్టుకు యెన్ని సంచుల రూపాయిలో వెంటనే ముట్టేవి అని యిప్పటికిన్నీ చెప్పకుంటారు. జుట్టు పోఁగోట్టుకొని రూపాయిలు స్వీకరించినవారిలో యిప్పటి కెవరున్నూ మిగిలినట్లు లేదు. యాభై అరువై యేళ్లనాఁటి ముచ్చట్లు. యీ సంగతి తెలిసి కొందఱు ధనసంపాదనకు యిది మంచి వుపాయమని రాజాగారివద్ద కొంత తెలివి తక్కువగా నడవడాన్ని ఆరంభించేవారంట. యెందుకంటే ఆ కాలంలో యిప్పటికాలంలోలాగా - సకలమ్మున్ గొరిగించుకోవడం ఫేషను కాకపోవడంచేత, జుట్టుపోయిందంటే పెద్ద అవమానమేకాని, ఆ అవమానానికేమి, పోతేపోయింది వెధవజుట్టు, మళ్లా పెరుగుతుంది. "శాకినీవ దినేదినే" వేలకొలది సొమ్మ దానంతటది వచ్చి యింట్లో పడుతుంది గదా! అని ఆ పెద్ద మనుష్యుల ఆశ. "బోలెడుతిట్లయినా బొక్కెండు కొఱ్ఱలుగా" వంటారుకదా పెద్దలు? అయితే అలా ప్రయత్నించినవారి జుట్టుమాత్రం మారాజావారి ఆయుధానికి వక్కటీకూడా బలిఅయినట్లు నేను వినలేదు. యెంతసేపూ వారి దివానులవీ, అడపాదడపా గవర్నమెంటు వుద్యోగులవీ అరుదుగా పండితులవీ పోతూవచ్చాయి. పండితులంటే ఆకాలంలో ఆ బిరుదు రావడం సామాన్యంగా వచ్చేదికాదు. కావ్యనాటకాలంకారాలు పూర్తిగా చదివినవారికి ఆ బిరుదు వుండేదేకాదు. సాహిత్య గాళ్లనేవారు వారిని. ఏదో వక శాస్త్రంలో పూర్తిగా పాండిత్యం సంపాదిస్తేనే పండితుడనడం. ప్రస్తుతం పండిత అనేబిరుదు బహు తేలికగా సంపాదన అవుతూవుంది. దీన్నిలా వుంచుదాం.

పొక్కునూరి వేంకట శాస్రులుగారు

పండితులలో అనగా సాహిత్యపరులలో పొక్కునూరి వేంకట శాస్రుల్లు గారనేవా రొకరు శ్రీ రాజావారితో బహు చనవుగా మాట్లాడేవారుండేవారట! శ్రీవారున్నూ యీ శాస్త్రుల్లుగారున్నూ సహాధ్యాయులని వినడం. యే చదువు సందర్భంలోనో తబిసీలు తెలియదుగాని బహుశః కావ్యపాఠ సందర్భంలో అయి వుండాలి. రాజావారు యెవరేనా పండితులు వస్తే వారితో ధారాళంగా సంస్కృతమే మాట్లాడేవారని వినికి. ఆ కారణంచేత వారు బాల్యంలో సంస్కృతభాష అభ్యసించి వుండాలి. ఆ సందర్భంలో యూయన రాజావారికి సహాధ్యాయులో, సతీర్థులో అయివుండాలి. ఆ చనువుచేత ఆంతరంగికులుగా వుండడమే