పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పిఠాపురప్రభువు లేటు శ్రీ గంగాధర రామారావుగారి కథలు

19


కాకుండా యీయన రాజబంధువులకేమి, పండితులకేమి యెందటికో రాజావారిచేత యెన్నో వుపకారాలు చేయించినట్లు వినికి. అంత చనువుండడంవల్ల నిర్భయంగా మాట్లాడుతూ వుండడం వుండేదేమో. దానిలో యేం పొరపాటొచ్చిందో వకపర్యాయం కాబోలును రాజుగారి కత్తికి శాస్త్రుల్లుగారి జుట్టుపిలక పనిచెప్పినట్లు వింటాము. ఆ పిమ్మట కూడా వారిద్దరికీవున్న బాల్యమైత్రికి లోటులేకుండానే జరిగినట్టున్నూ వింటాము. ఆ కారణంచేతనే ఆ శాస్రుల్లుగారెప్పడో మళ్లా రాజాగారు కులాసాగా మాట్లాడుతూవున్న సందర్భంలో యీ జుట్టుకోఁత ప్రసంగం వచ్చేటప్పటికి “మహాప్రభో, నా జుట్టు యెంతో అదృష్టం పెట్టిపుట్టిందికనక మీవంటి మహాప్రభువుల కత్తికి యెరయింది” అంటూ యింకా కొంత మోటుగానే మాట్లాడినట్లున్నూ ఆయుక్తికి రాజావారు చాలా సంతోషించినట్లున్నూ కూడా వినికి.

వకకమ్మకులీనుడు

ప్రసక్తానుప్రసక్తంగా జుట్టుకోఁత ప్రకరణంలోకి దిగాంగనుక యీ ప్రకరణం తరువాయికూడా యేకరు పెట్టేసే ప్రధానాంశంలోకి వస్తాను. గృహస్తులలోకి శ్రీ రాజావారికి మిక్కిలీ ప్రేమపాత్రుఁడైన సంపన్న గృహస్థు వక కమ్మకులీనుని జుట్టుక్కూడా యీ అదృష్టం పట్టిందట. కాని వెంటనే నలభైవేల రూపాయిల సంచులను యేనుఁగుమీఁద వేసికొని రాజావారు ఆ ఆసామీని గౌరవించడానికి స్వయంగా మితపరివారంతో వస్తాదు సహితంగా ఆయన గ్రామానికి దయచేసినట్టున్నూ ఆకమ్మ కులీనుని మేనల్లుళ్లు వగయిరా అసలాయన యెంతచెప్పినా వినక రాజావారిని అవమానించే ప్రయత్నం పూర్తిగా చేసినట్టున్నూ యేలాగయితే యేమి వస్తాదు తెలివి తేటలవల్ల ఆ గండాన్నుండి తప్పించుకొని రాజావారు సురక్షితంగా కోటలోకి చేరుకున్నట్టున్నూ వినికి. కాని అసలు జుట్టుకోతబడ్డ ఆసామీ మిక్కిలీ రాజభక్తుడున్నూ రాజావారి మృదుహృదయమున్నూ తాత్కాలిక కోపమున్నూ యెఱింగినవాడున్నూ అవడంచేత, లేశమున్నూ తన మేనల్లుళ్ల దురాగతానికి సమ్మతింపనేలేదని యేకగ్రీవంగా అందఱూ చెప్పకుంటారు. అయినా తుదకు మేనల్లుళ్లు చేసిన పనికి ప్రతిఫలంగా ఆ ఆసామీ యేడు సంవత్సరాలు కాబోలును కఠిన శిక్ష అనుభవించి విడుదలకాకుండా ఖయిదులోనే కాంబోలును మరణించినట్లు విన్నాను.

సవతినాయనమ్మగారు

జుట్టుకోఁతలలో కొంత గణింపదగ్గది పురుషులకు సంబంధించిందిది మాత్రమే. స్త్రీలకు సంబంధించినవి అంతగా నున్నట్లే లేదు. సవతి నాయనమ్మగారిమీఁద కాబోలును