పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


సోమరులుగా వుండనే వుండరు. యిప్పుడు చేసేయత్నం ధనికులు కూడా సోమరులుగా వుండకుండావుండడానికే. రష్యాలో యీ ప్రయత్నం నెగ్గినట్టుచెప్పుకుంటారు. కొందఱేమో ఆదేశంలో అవలంబించిన సామ్యవాదంలోకూడా కొన్ని అతివ్యాప్త్యవ్యాప్తులు వచ్చి మళ్లా మఱోమాదిరిగామార్చాలనే అభిప్రాయంకలుగుతూ వున్నట్టు చెప్పుకుంటారు. అందఱినీ సమానంగా వుంచడం భగవంతుని వుద్దేశమే అయితే కొందఱి నాలాగా కొందఱినీలాగా సృష్టిచేయడమే తటస్థింపదేమో? దీన్నిబట్టి భగవదుద్దేశం యిందుకు అన్యథా వుందనుకోవాలి- "నానాగతి విధికృత సృష్టియందకనపడునుగదా!" మన పండితులందఱూ యీసిద్ధాంతానికి కట్టుపడేవారే. పాశ్చాత్యులో- “యత్నే కృతే యది న సిద్ధ్యతి కోஉ త్రదోషః" అనే పంథలో వారు-భగవంతుఁడున్నాఁడని వప్పుకుంటారుగాని వారివుద్దేశ్యాని క్కూడా భిన్నంగా పనిచేసి నెగ్గఁగల మనో ధైర్యం కలిగివుంటారు. మనవారో? యీ విషయంలో యేకారణంచేతైతేయేమి పూర్తిగా సోమరితనాన్నే కనపఱుస్తారు

శ్లో. "కనకశిబికారూఢాః ప్రౌఢాధిరాజ్యపదేస్థితాః
      కతిచిదతులంమన్యా ధన్యాశ్చరంతి య దిందిరే!
      యదపిచవహం త్యేతాన్ దీనాన్పరే ఫల మంబ! త
      ద్ద్వయమపి తన స్తోకా లోకాన్వయవ్యతిరేకయో"

యీశ్లోకముఖ్యతాత్పర్యం లోకంలో కొందఱు పల్లకీ యెక్కడానికిగాని మఱికొందఱు ఆ పల్లకీ మోయడానికిఁగాని భగవత్కటాక్షం వుండడమున్నూ లేకపోవడమున్నూ కారణం గాని స్వప్రయోజకత్వాప్రయోజకత్వాలు లేశమున్నూ కారణంగావు అని ప్రాజ్ఞులో? అప్రాజ్ఞులో? మన పూర్వులు అందఱూ యేకవాక్యతగా పై సిద్ధాంతాన్ని ఆమోదిస్తారు. కొందఱికి భగవత్కటాక్షం వుండి కొందఱికి వుండకపోయే పద్ధతిని దయామయుఁడైన భగవంతుఁడికి వృథాగా పక్షపాతదోషం తగులుతూవుందనీ ఆదోషనివారణకోసం వాళ్లువాళ్లు చేసుకున్న పుణ్యపాపకర్మలనుబట్టి భగవదనుగ్రహం వుండడమూ, వుండక పోవడమూ కలుగుతుందన్నారు. దీనిమీcదకూడా శంకలయితే లేకపోలేదుగాని వున్నా యింకోమార్గం కంటె యీమార్గం కొంత కట్టుదిట్టంగా కనబడుతుంది. ధనధాన్యాల విషయంలో సామ్యవాదపరులు అందఱినిన్నీ యేకరీతికి తేఁగలుగుతారేమో కాని తెల్వితేటలలో, అందచందాలలో, బలాబలాలలో యింకా యెన్నిటిలోనో తేలేరని వ్రాయనక్కఱలేదు. యిది విషయాంతరం. సోమరిపోతులకు సత్రాలుపెట్టి సోమరితనాన్ని వృద్ధిపఱచిన నిర్వ్యాజ కరుణాశాలులకన్నదాన్ని నశింపఁజేయడానికి ప్రయత్నించేవారిని సర్వథా అభినందించడం యుక్తమే అని చెపుతూ దీన్ని ముగిస్తాను.


★ ★ ★