పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటివారు

59

    రాక్షతి మేనువీడిన యరాతికిఁ గల్గు సుధారసంబు త
    ద్భైక్షము మంచిదో యమృతపానము మంచిదొ యెంచిచూడఁగన్.
మ. అరుదౌ నీబిరుదప్రతాపములు కల్యాణాద్రిపై నుండి కి
    న్నరగంధర్వసతుల్ సదా శ్రుతిపుటానందంబుగాఁ బాడఁగా
    నరరే బాపు బళీ! సెబా! నహహ! యౌరా! మే! లహో! యందు ర
    య్యరివీరుల్ వెలుగోటి యాచవిభురంగా! సంగరక్ష్మార్జునా!
ఉ. అంచితరాయరావుబిరుదాంకము రాజులఁ గొట్టి యందె గీ
    లించిన మాదభూవిభుని లింగనృపాలున కొప్పుఁగాక గ
    ర్వించిన నీకుఁ జొప్పడునె వేమఱునల్లయవేమరెడ్డి! పో
    కొంచెపుఁ దమ్మతిండితినుకూళకు సింహతలాట మేటికిన్?

ఈ వంశమున సర్వజ్ఞ సింగభూపాలుఁడు, విద్వత్కుమార యాచమనాయఁడు మొదలగు విద్వత్ప్రభువుల వెలసినారు. విద్వద్కుమార యాచమనాయని వైదుష్యదాతృత్వములకు ద్యోతకముగా నీ క్రింది విధమున నొక కథ యున్నది.

“విద్వత్కుమార యాచమనాయఁడు ప్రభుత్వము చేస్తుండగా, ఒక విద్వాంసుఁడు ఆస్థానమునకు వచ్చి శాస్త్రప్రసంగము చేసి సంస్థాన పండితులను వోడగొట్టెను. కుమార యాచమనీడు మిక్కిలి సంతోషించి ఏమి కావలెనో కోరుకొండని పండితుని అడిగెను. ఆయన దేవర సంస్థానములో నా మనోవృత్తికి చాలినంత భూమి దయచేసి, నా నిత్యకర్మానుష్ఠానములు చక్కగా జరిగేటట్టు అనుగ్రహించవలసినదని కోరెను. ఏ వూళ్ళో ఏ పొలము కావలెనో, మీరే సస్యగర్భముగా చూచుకొని వచ్చి చెప్పితే సర్వమాన్యముగా దానపత్రము వ్రాయించి యిప్పిస్తున్నామని రాజుగారు సెలవిచ్చిరి. ఆ పండితుఁఢు వారి తాలూకాలో తీర్థం