పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

చాటుపద్యమణిమంజరి

పా డనే వూరికి పోయి అక్కడ జలసమృద్ధి, స్థలసమృద్ధి చూచుకొని తన స్నానసంధ్యానుష్ఠానములకు అనుకూలంగా ఉన్నదనుకొన్నాఁడు. ఆ వూఱి చెఱువుకు దక్షిణపు తట్టు పొలం తనకు వనరుగా భావించెను. రాజుగారి దగ్గిరకు వచ్చి, ఆ సంగతి విన్నవించి అక్కడు ఆ చెఱవు దక్షిణపు చేనుకు దానపత్రము పుట్టించుకొనెను. ఆ వూరికి బోయి గ్రామస్తులతో మాట్లాడి గ్రామకరణమును సంతోషపెట్టి తన దానపత్రము చూపించెను. “అయ్యో బ్రాహ్మడా! చెఱువుకు ఉత్తరపు చేను సుక్షేత్రమై వుండగా వట్టి చౌటిపఱ్ఱ, దక్షిణపు చేను కోరుకొన్నావేమిటి? మాతో చెప్పక వెఱ్ఱిపని చేస్తివి” అని కరణం చెప్పేటప్పటికి, ఆ పండితుఁడు “సరి కుదురుతుందిలే” అని లోలోపల సరిచూచుకొని, “అయ్యా! నేను కోరినదిన్నీ అదేనండీ! అట్లాగే వ్రాయించినా” నని ఆయనకేదో చెప్పి లోబరుచుకొని, చెఱువు కుత్తరపు చేనే విడుదల పెట్టించుకొన్నాఁడు. దాన్ని సాగుబడిచేసే రైతును వెళ్ళగొట్టి తన సేద్యగాళ్ళను చొప్పించి తగువు సాగించినాఁడు. అంతట ఆ భూమి కాపు రాజుగారి దగ్గిర ఫిర్యాదు చేసుకొనెను. పిలిపించి, “యిదేమిటి? మీరిట్లా చేయవచ్చునా?” అని రాజుగారు పండితుణ్ణి అడిగిరి. “తమరు దానపత్రంలో వ్రాయించిన ప్రకారం చెఱువు వుత్తరపు చేనే నేను లోబరుచుకొన్నాను. నా తప్పేమి?” అని పండితుఁ డనెను. స్వయము పండితుఁడు గనుక ఆ రాజు, “ఓహో! చెఱువు వుత్తరపు చేననగా ఏ చేనుకు చెఱువు వుత్తరముగా వున్నదో ఆ చేనని అర్థము చేసినాఁడు సుమా” అని గ్రహించి “బహువ్రీహి చేస్తిరా?” అనెను. “దేవరవారు దయచేసిన భూమి బహువ్రీహిగాక అల్పవ్రీహి కావచ్చునా” అని ఆ పండితుఁడు చమత్కరించెను.