కందుకూరి జనార్దనాష్టకము
1. సిరులు మించిన పసిమిబంగరు జిలుగుదుప్పటి జాఱఁగాఁ
జరణపద్మముమీఁద, దేహము చంద్రకాంతులు దేరఁగా
మురువుచూపఁగ వచ్చినావో మోహనాకృతి మీఱఁగా
గరుడవాహన! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
2. ఆనపెట్టిన రాకపోతివి ఆయెఁబో అటుమొన్ననూ
పూని పిలువఁగ వినకపోతివి పొంచిపోవుచు మొన్ననూ
నేను చూడఁగఁ గడచిపోతివి నీటుచేసుక నిన్ననూ
కానిలేరా, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
3. నిన్నరాతిరి చవికెలోపల నీవుచెలి కూడుంటిరా
ఉన్నమార్గము లన్నియును నే నొకతెచేతను వింటిరా
విన్నమాత్రము కాదురా నిను వీధిలోఁగనుగొంటిరా
కన్నులారా, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
4. దబ్బు లన్నియుఁ దెలిసికొంటిని తప్పుబాసలు సేయకూ
మబ్బుదేరెడి కన్నుగవతో మాటిమాటికి డాయకూ
ఉబ్బుచేసుక తత్తఱంబున నొడలిపైఁ జెయివేయకూ
గబ్బితనమున, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
5. బిత్తరంబున మొలకకెంపులు పెదవి నెవ్వతె ఉంచెరా
గుత్తమైనమిటారిగుబ్బలగుమ్మ యెవ్వతె మెచ్చెరా
చిత్తగించక జీరువారను చెక్కి లెవ్వతె నొక్కెరా
కత్తిగోరుల, దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
6. అండబాయక కూడియుంటిమి ఆయెఁబోయెను నాఁటికి
ఖండిమండిపడంగ నేటికి? కదలు మెప్పటిచోటికి
ఉండరా నీమాటలకు నే నోర్వఁజాలను మాటికి
గండిదొంగవు దనుజమర్దన! కందుకూరి జనార్దనా!