పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమతరంగము

47

నున్న వా “రయ్యా! తమకు దీనియందుఁ బ్రీతివిస్తారము గదా! ఇప్పు డొకపద్యమును దీనిపైఁ జెప్పు”డని కోరఁగా నీకవి యాశువుగా రచించిన పద్యము—

మ. ఠవణింతు న్నుతి దైవతప్రమదతార్థ్యన్మోహినీనీరభృ
   చ్చ్యవమానామృతశీకరాభనవబీజప్రాంతరౌపమ్యస
   ద్భవనాజాండకు షడ్రసప్లుతసముద్యత్స్వాదుమతఖండకున్
   అవితుంగోద్భవకాండకున్ సరసమోహాఖండ కాదొండకున్.

ఈయనదే వేఱొకపద్యము—

ఉ. రామశరప్రయోగము; సురప్రభువజ్రము; చక్రిచక్రమున్;
   ధామనిధిప్రియాత్మజువిదండము; కామరిపుత్రిశూలమున్;
   భూమినొకప్డు రిత్తయయి పోయినఁ బోవునుగాక, యీకవి
   స్వాములవాక్ ప్రయోగముల బ్రహ్మకునైనఁ దరంబె త్రిప్పఁగన్.

అడిదము సూరకవి

ఈకవి పూసపాటివిజయరామరాజుగారి యాస్థానకవి. విజయరామరాజుగారు విజయనగర ప్రభువులు. విజయనగరము విశాఖపట్టణపుమండలములోనిది. ఇక్కవి నివాసగ్రామము రేగ (రేవ) యను గ్రామము. ఆగ్రామమునఁ జెఱువుక్రింద నతనికి మాన్యము కలదు. ఒకసంవత్సరమున దంతులూరి యన్నమరాజనునాఁతఁడు గ్రామము నంతయు గుత్తకుఁ దీసికొని, చెఱువుఁ బిగఁ గట్టించి, మాన్యమునకు నీ రీయకపోఁగా సూరకవి పద్యములతో రాజుగారికి మనవి వ్రాసికొనెను. ఆపద్యము లివి.