పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థతరంగము

211

క. ఏనాఁటి యగ్రహారమొ
   మీనాఁటికి కండ్రికాయె మీపనిదీరన్
   మానాఁడు మాన్యమాయెను
   నానాఁటికిఁ దీసికట్లు నాగంభొట్లూ!

క. లింగాలగురివిశెట్టికి
   గంగాధరుఁ డేమిగతులు కల్పించెనయా?
   బంగారువంటి కోమటి
   సంగీతమువల్ల బేరసారము లుడిగెన్.

క. వంకాయవంటి కూరయుఁ
   బంకజముఖి సీతవంటి భామామణియున్
   శంకరునివంటి దైవము
   లంకాధిపువైరివంటి రాజును గలఁడే?

విధవలు


సీ. పోఁకలు నమలుచు నాకులు చేఁబూని
               సున్న మడుగువాఁడు శుద్ధవిధవ
   ఇద్దఱు నొకచోట నేకాంతమాడంగ
               వద్దఁ జేరెడువాఁడు వట్టివిధవ
   ఆలితోఁ గలహించి యాఁకలి గాదని
               పస్తుపండెడువాఁడు పంజివిధవ
   దారిద్ర్యములనుండి తనపూర్వసంపద
               లూరకతలఁచువాఁ డుత్తవిధవ
   ఇట్టివిధవలఁ గడఁద్రోచి యెసకమెసఁగఁ
   గావుమీ వేడ్క విబుధులఁ గమలనాభ!
   పాహి శ్రీపార్థసారథి! పరమపురుష!
   తిరుమలద్దంకి మల్లికేశ్వరగిరీశ!