పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

చాటుపద్యరత్నాకరము

ఉ. ఎన్నఁడుఁ దాతనాఁడుఁ దనయింట నెఱుంగనికల్మిగల్గెనా!
   వెన్నున కద్ద మడ్గుఁ గొనవేళ్ళకుముచ్చెలుతొడ్గు నింతలో
   మిన్నెగఁ జూచు ధింధిమని మిట్టలు ద్రొక్కుని దేమి చిత్రమో!
   పన్నగభూష! సన్మృదులభాష! సదాశివసద్గురుప్రభూ!

భైరవా


చ. చెఱకురసంబుకన్న నునుచేడెలకన్నను తేనెకన్న భా
   సురసుధకన్నఁ దియ్యనగుచూతఫలంబుకన్నఁ బాండుశ
   ర్కరరుచికన్న ధాత్రి మధురంబయి తోఁచు వివేకియౌ మహా
   సరసునితోడిముచ్చటలు సారెకు సల్పుచు నున్న భైరవా!

ఉ. బంధులు తన్ను మెచ్చ జనపాలురు మెచ్చను బ్రజ్ఞలేక కా
   మాంధతనుండు ముష్కరున కారయ మేదినియందు నీతియౌ
   గ్రంథములేమిసేయు జిగికన్నులవానికిఁ గాక దర్పణం
   బంధునకేమిసేయ పగలైనను రాతిరియైన? భైరవా!

ఉ. డంబముమాని మూఢులకుఁ డంకములీయక దేశకాలపా
   త్రంబు లెఱింగి యిచ్చినపదార్థము వన్నియకెక్కు ధాత్రిపై
   నంబుధినున్న శుక్తికములందునఁ జెందిన స్వాతివాన ము
   త్యంబులుగావె? ధన్యులకు హారములై వసియింప భైరవా!

చ. సరసునితారతమ్య మది సాధుఁడెఱుంగును గాని మూఢుఁడే
   మెఱుఁగును రంభఁ గూడి సుఖియించుటఁ జూడఁగఁ బాకశాసనుం
   డెఱుఁగునుగాని బానిసల నెప్పటికిన్ రమియించుచుండువాఁ
   డెఱుఁగునె దేవకాంతవలపించుట యించుకయైన? భైరవా!

ఉ. ఇల్లు భుజంగమైనఁ దనయిష్టుఁడు వైరికి మర్మమిచ్చినన్
   గల్లనిజంబు నేర్పరుపఁ గానక భూపతి చంపవచ్చినన్
   దల్లి విషంబుఁ బెట్టినను తండ్రి ధనాఢ్యుల కమ్మఁజూచినన్
   వల్లభుఁ డొల్లకున్న నిఁక [1]వారల కెవ్వరు దిక్కు భైరవా!

  1. వారల కేగతి తిమ్మభూపతీ! యని పాఠాంతరము