పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థతరంగము

207

ఉ. వేదములేనివిప్రుఁ డరవిందములేనిసరోవరంబు ము
   త్తైదువలేనిపెండ్లి హిమధాముఁడులేనినిశీధి మీటినన్
   నాదములేనివీణ నరనాథుఁడులేనిపురంబు వ్యర్థమౌఁ
   గాదె తలంప స్వామి! శితికంఠ! సదాశివసద్గరుప్రభూ!

ఉ. దుస్తరమైనమూర్ఖునకు దుర్మతివీడఁగ నెంతదెల్పినన్
   స్వస్థపడంగఁ బోదొకటి సాదృశమిందుల కుల్లి మోసుకున్
   గస్తురిపాదుఁ జేసి తగగంధముఁ బన్నిరుఁ బోసి పెంచినన్
   బుస్తుగుణంబుఁ దా విడువబోదు సదాశివసద్గురుప్రభూ!

ఉ. దీపములేనియిల్లు నుపదేశములేనిజపంబు మంజులా
   లాపములేనికావ్యము విలాసములేనివిధూటి విక్రమా
   టోపములేనిభూపతి పటుత్వములేనియురోజపాళి ప్ర
   స్తావములేనిమాటలు వృథాలు సదాశివసద్గురుప్రభూ!

ఉ. ఆఁడది హెచ్చి భర్త కెదురాడఁగ వచ్చినఁ గొట్టవచ్చినన్
   గూడదు దానితో నవలఁ గూడి నటించుట; తత్క్షణంబునన్
   వాఁడొకజాణయైన భగవత్పదసన్నిధిఁ జేరుమార్గమే
   చూడవలె న్మనోజ్ఞమగుచోట సదాశివసద్గురుప్రభూ!

ఉ. పంటకురానిచేలు పతిభావమెఱుంగఁగలేనియాలు నీ
   రంటినపాలు దోర్బలపరాక్రమహీనునిచేతివాలు వే
   యింటికినీనికేలు భుజియింపక దాచువరాలు ధాత్రిలో
   మంటికిపాలు గాక మఱి మన్నన కెక్కునె? సద్గురుప్రభూ!

ఉ. వేచనికందిపప్పు నవివేకునిమెప్పు వికారియొప్పు ము
   ల్లాచనిచెప్పు కుర్లుముడికందనికొప్పు పఠాణిచొప్పు మే
   ల్వాచవినేచునుప్పు దురవస్థలు చెప్పఁ దరంబుగాదయా
   మేచకకంఠ! చక్రధరమిత్ర! సదాశివసద్గురుప్రభూ!