పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

చాటుపద్యరత్నాకరము

   వనిత నీమాటలే నీకు వైర మగును
   అనుచు నొక్కతె పల్క మాఱనె నొకర్తు
   శ్వాస, యుచ్చ్వాస, ఘనవేణి చంద్రికాస్మి
   తహరిమధ్యమ లేదని తలఁగ కనియె.

ఒకానొక వేశ్యారసికుఁ డొకవెల్లాటకత్తెయింటికి వెళ్ళెనఁట. ప్రసంగానుకూలముగా నాపడుపుచెలి రసికునిట్లు ప్రశ్నించెనఁట.

ఉ. మొల్లసుగంధి కూఁతురది ముంగిటనున్నది దానిఁ జూడు; నే
   నెల్లవిధంబులన్ రతుల నేలెడుదానను నన్నుఁ జూడు; ము
   త్ఫుల్లసరోజనేత్ర వరపుత్రిక పుత్రిక దానిఁ జూడు; నా
   కల్లుఁడ వయ్యెదో? మగఁడ వయ్యెదవో? మనుమండ వయ్యెదో?

ఆప్రశ్న కారసికుఁ డీరీతిగా జవాబొసంగెనఁట.

ఉ. మొల్ల సుగంధికూఁతురిని ముంగిటఁ గంటిని దాని మాన; నీ
   వెల్లవిధంబులన్ రతుల నేలెడుదానవు నిన్ను మాన; ను
   త్ఫుల్లసరోజనేత్ర వరపుత్రిక పుత్రిక దాని మాన; నీ
   కల్లుఁడ నయ్యెదన్ మగఁడ నయ్యెద మనుమండ నయ్యెదన్.

అటుపిమ్మట కొంతసేపటి కాధనకాంత రసికునకు వక్కలాకు లొసంగెనఁట. ఆతఁడు సున్నముఁ దెమ్మని యీరీతిగా నడిగెనఁట.

గీ. పర్వతశ్రేష్ఠపుత్రికాపతివిరోధి
   యన్నపెండ్లామునత్తనుగన్నతల్లి
   పేర్మిమీఱినముద్దులపెద్దబిడ్డ!
   సున్న మించుకఁ దేగదే? సుందరాంగి?