పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయతరంగము

107

   కవికృతపుస్తకగ్రహణగర్వితు లల్పులె పూజ లందఁ గాఁ
   గవు లఁట! దానపాత్రులును కారఁట! యిట్టివి పో విచిత్రముల్.

చ. గురుకులవాసఖేదమునకుం గడు డస్సి యపారశాస్త్రసా
   గరముల నీదియు న్వలఁతి గాఁ డలరింపఁగఁ బండితుండు తా
   వరకవు లద్యదిందుకర వారసమాగమఫుల్లహల్లకో
   త్కరవిగవళన్మరందపదకాండముచే నలరించుచాడ్పునన్.

గీ. ఎంచి యెంచి చూడ నింపయి తోఁచు నీ
   మూఁడులోకములను ముగ్ధ లైన
   మించుబోండ్లచూపు లించురసంబులు
   చతురు లైనకవులసరసమతులు.

చ. పలుమరు శాస్త్రముల్ చదివి పండితుఁడై యజురాణిసత్కృపా
   ఫలమును గాంచి తా రసము బాగుగఁ జెప్ప వలంతి యైనవాఁ
   డిలఁగవి; లాతివాఁడు కపియే యని చెప్పఁగ నొప్పు; జాయ నాఁ
   గులజయ జాయ గాని పెఱకోమలి మాయయ కాక జాయయే?