పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

చాటుపద్యరత్నాకరము

నీతఁడు నియోగిబ్రాహ్మణుల కిప్పించెను. ఒకతఱి నీతఁడు కృష్ణవేణీనదీతీరమున భూదానము పరిగ్రహించి సశాఖీయుల భరించెనఁట. అందుల “కెప్పుడు నబద్ధపువ్రాఁతలు తగాదావ్రాఁతలు వ్రాసికొని జీవించుచుండు నీ నియోగులు దానపాత్రులా?” అని వైదికులెవరో యాక్షేపింపఁగా నియోగు లెవరో చెప్పిన సమాధానపద్యములు—

ఉ. వ్రాయుట చిత్రమా? వికృతవైదికమా? నిజదారరక్షణో
   పాయముకై నియోగి యిలఁ బార్థివసేవ యొనర్చినంతనే
   పాయునె! వంశశీలములు పాయక యెప్పుడు చిత్రగుప్తులున్
   వ్రాయరె? యెల్లలోకములవారలుఁ జేసిన పుణ్యపాపముల్.

ఉ. మానఘనుండు బ్రహ్మకులమండనమూర్తి పరోపకారి దు
   ర్దానదురన్నముల్ గొనఁడు తప్పఁడు స్వామిహితోపకారముల్
   దీనులఁ బ్రోచు బాంధవవిధేయుఁడు డస్సియు వేఁడఁబోఁడు తా
   నూనినవేడ్కతోడుత నియోగికి నిచ్చినదాన మల్పమే?

కవులు దానపాత్రులు గారని యాక్షేపించుచుఁ జెప్పిన పద్యము—

చ. అవగతశబ్దశాస్త్రచయు లైన మహాత్ములు పండితోత్తముల్
   భువనతలంబునం దధికపూజ్యులు వార లటుండఁ గూటికై
   నవనవకల్పనావిధిచణత్వము తోఁప నబద్ధమాడు నీ
   కవు లిల దానపాత్రు లయి గౌరవమందుట చూవె చిత్రముల్!

పై యాక్షేపణకు సమాధానము—

చ. కవి కమలాసనుండు త్రిజగత్పతి యైనపినాకపాణియుం
   కవియె తలంపఁగాఁ గవులుకారె పరాశరబాదరాయణుల్