పుట:Chanpuramayanam018866mbp.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12 చంపూరామాయణము

గీ. కరము రాణించు సౌజన్య గరిమధన్య, పరమకల్యాణి కసవభూపాలురాణి
ఆశ్రితత్రాణ విలసత్కృపావలంబ, సద్గుణకదంబ చిన్నకృష్ణాజిమాంబ. 66

క. ఆచినకృష్ణాజిమ ల, క్ష్మీచంద్రాననవిధాన సేవింపఁ గృపా
రోచిష్ణుఁడు కసవప్రభుఁ, డాచక్రాయుధునికరణి నమరున్ ధరణిన్. 67

షష్ఠ్యంతములు

క. ఈదృక్కళ్యాణగుణా, మోదితలోకునకు భువనమోహనకుశల
స్వాదూక్తివిపాకునకు మ, హీదేవాశ్రాంతభజనహేపాకునకున్. 68

క. గండరబాలాంకున కు, ద్దండభుజబలనవీనతాలాంకునకున్
ఖండితరిపుజాలునకుం, బండితకవిరాజరాజిపరిపాలునకున్. 69

క. రాజగ్రామణికిం బద, రాజీవప్రణతవిముఖరాజన్యగజో
ద్వేజనసృణికిం గోనాం, బాజఠరసవీనశుక్తిమౌక్తికమణికిన్. 70

క. ఆరామసత్రసౌరా, గారసరఃప్రముఖధర్మకర్మవినిర్మా
ణారూఢకీ ర్తినిధికిన్, ధీరస్తుతమధురసాహితీసేవధికిన్. 71

క. శ్రీలప్రాభవనిధికిం, దోళప్పాచార్యచరణతోయజసేవా
శీలప్రాదుర్భూతవి, శాలప్రారంభధైర్యసారాంబుధికిన్. 72

క. కాశ్యపగోత్రోద్భవున క, వశ్యాయమయూఖలేఖవసుధాజసుధా
పశ్యాళికమౌళిధునీ, దేశ్యయశోహారవైశదీవిభవునకున్. 73

క. మంథానాచలధృతికిన్, సంధాభృగుపతికి శౌరచరణాంబుజపు
ష్పంధయశుభచిత్తునకు, బాంధవరక్షామిళత్కృపాయత్తునకున్. 74

క. ఆకాశీతలసేతు, ప్రాకటశరణాగతాభిరక్షణబిరుద
శ్రీకావేరినృపాంబుధి, రాకాచంద్రునకుఁ గసవరాజేంద్రునకున్. 75

వ. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన చంపూరామాయణం బను మహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టి దనిన. 76

కథాప్రారంభము

క. అమరమునిపల్కు విని సం, భ్రమమున వాల్మీకిసుకవి మాధ్యందినకృ
త్య మొనర్ప నరిగె సురుచిర, తమసారసకుముదవనికిఁ దమసాధునికిన్. 77

చ. అరిగి తదీయపావనతటావని నొక్కెడఁ దుంటవింటిబల్
దొరవిరితూపువాఁడిమికిఁ దోడు కిరాతశరాహతివ్యథం
బొరలి తపించుక్రౌంచయుగముం గని లోఁ గృపవూని మౌనిశే
ఖరునిముఖాంబుజంబున నొకానొకభారతి దోఁచె నీగతిన్. 78