పుట:Chanpuramayanam018866mbp.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 13

శ్లో. మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమ శ్శాశ్వతీ స్సమా:
య త్క్రౌంచమిథునా దేక మవధీః కామమోహితం. 79

చ. అని శపియించి మౌనివిభుఁ డక్కట! యొక్కెడఁ బోక తీర్థసే
వన కిపు డేటికి న్నదికి వచ్చితి వచ్చిన నేమి కొంచల
న్వనచరుఁ డేయ నేమిటికి వాఁ డటు లేసిన నేయుఁగాక నేఁ
గన లెదఁ బూని వానిఁ గొఱగానిగతిం బడఁదిట్టనేటికిన్. 80

మ. అని చింతించుచు వామలూరుతనయుం డాత్మీయపుణ్యాశ్రమం
బునకుం న్వచ్చినయంతలోనఁ బలుకుంబూఁబోఁడి వేఱొక్కది
క్కునఁ డెక్కు ల్పచరించునైఖరులు గన్గోలేనిచందంబునం
జనుదెంచెం జతురాస్యుఁ డంచతళుకున్సామ్రాణిదూఁకించుచున్. 81

క. చనుదెంచి విరించి తపో, ధనువలనిసపర్యఁ గాంచి త్రైలోక్యవ్యా
జనిజేంద్రజాలభుజగా, దనబర్హీభూతకృతి యతం డి ట్లనియెన్. 82

మ. నుడువుంజిల్కలకొల్కి సత్యజగతి న్నూల్కొన్నచందంబునం
బుడమి న్నల్గడ నాత్మవృత్తగతులన్ భూషింప నూహించి ని
ల్కడగావించె భవద్రసజ్ఞపయి నింకం దీనిచేఁ బ్రొద్దువం
గడపున్రాదొరవేలుపున్నడపడిం గబ్బంబు గావింపుమా. 83

చ. అని యవనిశ్రవోభవుని కానతియిచ్చి యలంఘ్యవర్ణలే
ఖనకరుఁ డేగునంతఁ జెలికత్తియ లై రఘురాముకీర్తివ
ర్తన లనవద్యపద్యతనుధారిణిఁ దన్మృదుశయ్య కొయ్యనొ
య్యనఁ గదియించినం బలుకుటంగన ముంగల యై చెలంగఁగన్. 84

సీ. అలరుఁబొట్లము విచ్చినట్లు కస్తురివీణె గోసినరీతిఁ గుంకుమము రాశి
బోసినఠేవఁ గప్పురము సిరంబు గుప్పినలీల మేళవించినవిపంచిఁ
బలికించినతెఱంగున లతాంగిబిగిచన్గవఁ గవుంగిలించినపగిదిఁ జంద
నాచలగంధవాహం బెదుర్కొన్నచందంబున నమృతపానంబుమాడ్కి
గీ. బుధకవుల కింపు జనియింప మధుమయోక్తి, రత్నఖనిదర్శి బ్రహ్మర్షి రచనసలిపె
శ్రవణలేఖనపఠనకృజ్జనఘనాఘ, హరణపారాయణంబు రామాయణంబు. 85

క. భవ్యపదశ్రావ్యముఁ ద,త్కావ్యముఁ గుశలవుల కతఁడు గఱపిన భువన
స్తవ్యులు వా రవి వనవా, స్తవ్యులకడఁ బాడి మెచ్చు సలిపిరి మదికిన్. 86