పుట:Chandrika-Parinayamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ. గళదర్కంబుఁ, బనీపతతత్కుజము, రింఖద్గోత్రగోత్రంబుఁ, జా
చల దుర్వీవలయంబు, ఫక్కదఖిలాశాకంబు, భిద్యన్నభ
స్థల మేఘౌఘము, భ్రశ్యదృక్షము, రణత్పద్మాసనాండంబునై
యలరెన్- దన్మహిపాలజైత్రగమ బంభారావ మప్పట్టునన్.

(ఆశ్వా1. ప.151)

ఇందులో ‘ళ’కార, ’ల’కారములకుఁ బ్రాసము చెల్లినది. పద్యమునందలి ‘గళత్’, ‘పనీపతత్’ మొదలగు శబ్దముల వ్యాకరణ విశేషములనుగుఱించి మరియొక శీర్షికక్రిందఁ జర్చింపఁబడును. యతులను బ్రాచీనులగు భీమన, అనంతుఁడు నిర్ణయించిన వానినే యుపయోగించెనుగాని యాధునికుఁడగు నప్పకవి చూపిన యతివైవిధ్యమును పాటించి ఉపయోగింపలేదు. ఇంతకు నప్పకవి యితనికిఁ దరువాతివాఁడేకదా! ఇఁక వచనరచనయందును తన యసాధారణప్రతిభను జూపుచుఁ గావ్యమునందు మొత్త మిరువది వచనములను, ఒక సంస్కృతదండకమును రచించెను. ఈసంఖ్యలో వచనములను పద్యకావ్యములందుఁ జేర్చిన పూర్వకవులు తక్కువ. ‘గద్యపద్యమయం కావ్యం చంపూ రిత్యభిధీయతే’ అను లాక్షణికవచనానుసారముగాఁ గద్యములును పద్యములునుగల కావ్యమునకుఁ ‘జంపువు’ అను పేరుండుట యుక్తము. కాని మన తెలుఁగుకవులు ఆపేరును బెట్టుకొనలేదు. బహుశః తెలుఁగుభాషలో చకారము తాలవ్యము (‘చ’)గాను, దంత్యము ( ‘ౘ’)గాను ఉండుటచేత ప్రజలవ్యవహారమున ‘చంపు’ అనుటకు బదులు ‘ౘ౦పు’ అని యగునను భయముచేత వదలియుందురని భావింతును. కనుక పద్యకావ్యము నందే యవసరమని తోఁచినప్పుడు వచనములనుగూడఁ జేర్చుచు, తత్ప్రయుక్తమగు నామకరణమును మాత్రము వదలుచు వచ్చిరి. మాధవరాయల వచనరచన విశిష్టమైనట్టిది. అందులో సంసస్కృతపదభూయిష్ఠములగు దీర్ఘసమాసములతో పాటు అచ్చతెలుఁగుపలుకుల కూర్పులును, అలఁతియలఁతి పదము లుభయభాషలయందును, శ్లేషాద్యలంకారములును, విరోధా భాసలు, విశిష్టశాస్త్రమర్యాదలు మొదలగు శబ్దార్థచిత్రములు విచిత్రముగాఁ బ్రకటితములై బాణుని కాదంబరీగద్యశైలిని, దండి దశ కుమారచరిత్రవైఖరిని, పెద్దనాదుల వచనరచనా