పుట:Chandrika-Parinayamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఛందోరీతులు:

కావ్యారంభమును శుభఫలప్రదమగు ‘మగణము’తోను, సర్వదోషహరమగు శ్రీకారముతోను గూర్చి, శార్దూలవృత్తము లో ‘శ్రీవక్షోజధరస్ఫురద్వర మురస్సీమన్’ అని సాగించుటచేత సత్సంప్రదాయవేత్త యని చెప్పవచ్చును.

కావ్యము పఠితలకును, యర్థముఁ జేసికొనువారికిని సులభపఠనీయమై యుండుటకుఁ గాబోలు, కొన్ని విశేషస్థలములందుఁ దప్ప సర్వత్ర ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభవిక్రీడితము, కందము, గీతము, సీసములనే వాడెను. ఆశ్వాసముల చివర వాడినవి పృథ్వీవృత్తము, ఉత్సాహవృత్తము, కవిరాజవిరాజితము, పంచచామరము, మాలినీవృత్తము అనునవి మాత్రమే. ఇఁక నాయా విశేషస్థలములయందు రసానుకూలముగా, సుచంద్రుఁడు, చంద్రిక యున్న కొండకోనలోని కోలాటమును విని యచ్చటి కుత్సాహమున వెళ్లునప్పుడు లయగ్రాహివృత్తమును, సుచంద్రతమిస్రాసురుల యుద్ధవర్ణనము నందు మహాస్రగ్ధరావృత్తమును, తమిస్రుఁడు సుచంద్రునిపై బాణములను ద్వరితగతితో వేయునప్పుడు త్వరితగతివృత్తమును, ఇంకను వారి యుద్ధవైచిత్రిని వర్ణించుటలో మాలిని, ప్రహరణకలితము, పంచచామరము, శిఖరిణి, భుజంగప్రయాతము, పృథ్వీవృత్తము అను వృత్తవిశేషములను, చంద్రిక చెలికత్తె లుద్యానవనమునఁ బువ్వులు గోయునప్పుడు వారి యుత్సాహమును దెల్పుటకు వృషభగతిరగడను మాత్రము రచించెను. గర్భకవిత్వమునుగాని, బంధకవిత్వమునుగాని స్వీకరింపలేదు. ‘ళ’కార ‘ల’ కారములకు ప్రాసమైత్రి నంగీకరించెనుగాని రేఫ ‘ర’కారముల ప్రాసమైత్రి నంగీకరింపలేదు. సీసపద్యముల రచనలో, శ్రీనాథుఁడు పెట్టిన యొరవడిలోనే సమాంతరవాక్యవిన్యాసము గల పెద్దపాదములు నాలుగింటినిఁ బూరించి, పిమ్మట గీతపద్యమును జత పరచు పద్ధతిలోనే కలమును సాగించెను. ‘ళ’’ల’ప్రాసమున కుదాహరణమనఁదగిన ఈక్రిందిపద్యమువంటి పద్యము ఆముక్తమాల్యద, అనర్ఘరాఘవమువంటి కావ్యములలో మాత్రము లభించును.