పుట:Chandrika-Parinayamu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. లలనాళిగీతకల్యాణగీతిక గాదు
చెవి యాన ఘనసింహరవము గాని,
సరసకేళీచంద్రశాలికావళి గాదు
విహరింప సంగ్రామవీథి గాని,
బంధురకర్పూరగంధచర్చిక గాదు
మే నూన మొనముల్కిసోన గాని,
సేవాపరాప్తధాత్రీవరౌఘము గాదు
తిలకింప దనుజేంద్రబలము గాని,

తే. గురుహితజనావృతవిహారఖురళి గాదు
శరగరిమఁ జోప శాత్రవాంతరము గాని,
తరము గాదిట్లు రణ మూనఁ దరణికులజ
తఱిమి వధియింతు నీవేళఁ దలఁగి చనుము. 126

త్వరితగతి. అనియసురకులరమణుఁ డరుణతరవీక్షా
జనితరుడనలకణవిసర మరిమనోభీ
జనక మయి పొదల శితశరచయముచేఁ ద
ద్వనజహితజననపతిఁ ద్వరితగతిఁ గప్పెన్. 127

చ. తెఱలనిశక్తి నప్పొలసుదిండికొలంబులమేటి యిట్టు ల
త్తఱి విశిఖాళిఁ గప్ప వసుధాపతి దట్టపుమంచుపిండు బల్
కఱకఱిమించులం దునుముకంజహితుం డన వాఁడితూపులన్
మఱలఁగఁ జేసి యాదనుజనాథుఁ గుఱించి మృదూక్తి నిట్లనున్. 128

చ. అలఘురణోర్విఁ జేరి యసురాధిప యీగతి వట్టిపల్కుచాల్
పలుకుట వీరధర్మమె నభస్స్థలి నిర్జరు లెల్లఁ జూడ నీ
చలము బలంబు శస్త్రకులచాతురిఁ జూపుము చూచి యంతటన్
బ్రలయకృశానుహేతిసమబాణపరంపరఁ గూల్తు గ్రక్కునన్. 129