పుట:Chandrika-Parinayamu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. నహహ! త్రైలోక్యవర్ణనీయాజరాంగ
నావతారవిలాసాప్తి నడరు కతన
మహిప! పాంచాలరాట్సుతామంజులాంగ
కాంతి చిత్రకరస్థేమఁ గాంచు టరుదె? 4

చ. సమరహితాత్మమై యతనుసాయకశక్తి భరించు నాసుదే
హమెఱుఁగుమేనితోఁ గడు ఘనాళి సహాయముఁ గన్న చంచలౌ
ఘము పగ లొందిన న్విగతకాంతిక మౌ ననఁ దద్విహీనతా
క్రమమున మించు చంపకము గాంచునె సొంపు విరోధ మూనినన్. 5

మ. జగతీనాయక కన్యపాదనఖముల్ సజ్జాలకత్రాణమా
న్యగతిం జేకొని లోకవర్ణ్యవిధుకాంతాకారసంపత్తి మిం
చఁగ ముత్యంబులు శుక్తికాతటిఁ దపశ్చర్య న్విజృంభించి హె
చ్చగు తాద్రూప్యముఁ బొందెఁ గానియెడ ముక్తాభిఖ్య యెట్లబ్బెడిన్. 6

చ. అనిశవిభాసితాత్మమృదుతారుణతాజితపల్లవాభ యై
తనరువెలందిపాదరుచిఁ దమ్ము లిరం గమలాప్తుగోక్రమం
బునఁ గని మించఁగాదె సిరి పూని కరమ్ములఁ జక్క నొత్తు లో
చనములు గంతుకేళివిధిజక్లమదారణదంభధీగతిన్. 7

చ. వెలఁదిమెఱుంగుపిక్కల యవేలమరీచిక ధాటి వెల్వడెన్
జలమున నంచుఁ గాహళిక సాంద్రరుతిన్ బయలూన్ప శాలి లోఁ
గలసినభీతి వాహినులకాండముతో హరిమండలంబుతో
వల నగు పొందుఁ గాంచియును వప్రము వెల్వడ కుండు నెంతయున్. (చిత్రతన్). 8

ఉ. రాజవరాత్మజాతపరిరంభసుఖం బొనగూర్చు నాకుభృ
ద్రాజకుచోరుకాండములు రంభలు గావున నొక్కొ నిచ్చలున్
రాజిలురక్తి సారసవనప్రవివర్ధనవృత్తిఁ బూనుఁ బో
రాజితహస్తిహస్తనికరంబులు తత్ప్రియభావ మూనఁగాన్. 9