పుట:Chandrika-Parinayamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీలక్ష్మీనరసింహాయనమః

చంద్రికాపరిణయము

తృతీయాశ్వాసము

క. విలసత్కమలాపదయుగ
లలితానుపమానదివ్యలాక్షాలక్ష్మో
జ్జ్వలతరకౌస్తుభమణిపి
చ్ఛిలరుచివక్షోవిశాల శ్రీగోపాలా! 1

తే. చిత్తగింపుము శౌనకాద్యుత్తమర్షి
సమితి కిట్లను రోమహర్షణతనూజుఁ
డప్పు డామోద మూని యక్షాధిపతి మ
హీంద్రుఁ దిలకించి వెండియు నిట్టు లనియె. 2

చ. ఇరఁ గల పద్మినీతతులయింపును సొంపు నడంచు మంపునం
గరముఁ బొసంగు చంద్రిక యఖండవిలాసము సన్నుతింపఁగాఁ
దరమె తదీయదీధితివితానము గన్గొనుమాత్రఁ బెంపు దు
ష్కరగతి మించు భూర్యసమకాండగవోదితతాపమండలిన్. 3

సీ. నెలఁత చన్గవదారి నెఱికొప్పు కటియొప్పు
ఘనచక్రవైఖరి నని నడంచుఁ,
గొమ్మ కన్నులరాణ నెమ్మోము మెడగోము
కలితాబ్జమహిమంబుఁ దలఁగఁ జేయు,
సకి నుందొడలరీతి చికురాళి నఖపాళి
సుకలభోర్జితజయస్ఫూర్తి నలరుఁ,
జెలి వలగ్నాభ పల్కులతీరు నూఁగారు
హరిమదాపహవృత్తి నతిశయిల్లు,