పుట:Chandrika-Parinayamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్యజనంబు లనుపమాన పవమాన మృదుయాన కలనానద్యమాన గగనగంగా తరంగడోలికావీథి నుయ్యల లూఁగు నవదాతపత్రంబులకు సగోత్రం బులై వైచిత్రిఁ జిత్రింప, విశాల విలోచన శతపత్త్రపత్త్ర విలసనంబును విమలభుజామృణాల సౌందర్యంబును వినీల భ్రమరక సౌష్ఠవంబును విరంజిత కింజల్కమాంజుల్యంబును బూని సరసగణ్యలావణ్య వైభవంబున నలరు పద్మినిపై మోహంబు వూని పౌర్వకాలిక వైరంబు డించి ప్రియంబు వచింపఁ జేరి తత్కరకమల లాలితం బగు శీతాంశుమండలంబుదండి నొక్కభుజంగభుఙ్మందయానామతల్లి దాల్చిన కర్పూర కలా చిక నయనామోదవీచికం జేకూర్ప, మహానంది గోరాజకుమారముఖ్యులు సెంతలం గొలువ నపూర్వ విభవంబునం బేరోలగం బుండు నవసరంబున. 123

సీ. స్వకటాక్షవిశ్రమస్థానన్నరశ్రేణి
యెడఁబోలె వరభూతి యొడల నొప్పె,
హృదయసారసవీథి యెడఁబోలె నలినాక్ష
సంభృతి కంధరాస్థలి నెసంగె,
మహితశిష్యోదితామ్నాయాళియెడఁబోలె
నలఘుజటారేఖ తలఁ జెలంగె,
నాత్మసంరచితాధ్వరావళియెడఁబోలె
సత్త్రాటకస్ఫూర్తి చక్షు లూనె,

తే. ననుచు నెమ్మది నద్భుతంబడర నఖిల
జనములు నుతింప నరుదెంచె సమ్మదంబుఁ
బూని సుకలానిరస్తోడుజాని సుగుణ
మణినికరఖాని శాండిల్యమౌని యపుడు. 124

మ. మునిరా జి ట్లరుదేర ద్వాస్థ్సితజనామూల్యోక్తి వైచిత్రి మే
ల్కని తోడ్తో నెదు రేఁగి, భక్తి వినతుల్ గావించి తోడ్తెచ్చి, నూ
తనచామీకరపీఠి నుంచి, యల గోత్రాకామినీకాముకుం
డనువొందన్ ఘటియించె నాదమికిఁ దా నాతిథ్య మప్పట్టునన్. 125