పుట:Chandamama 1948 01.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వం సింహళదేశానికి రాజొకడుండే వాడు,ఆయన పరాక్రమానికి అర్జునుడు, బుద్దికి బృహస్పతి, దానానికి కర్ణుడు. ఇన్నీ ఉన్నా ఆయనకు సంతానం లేదు. ఎందుచేతనంటే ఆయనకు వివాహం కాలేదు. ఎన్ని దేశాల రాజపుత్రికల్ని చూసినా ఆయనకు నచ్చలేదు.

ఇట్లా ఉండగా ఒకనాడు సింహళదేశానికి పర్షియాదేశపు వర్తకులు ఓడలపై వచ్చారు. వారిలో పెద్ద వర్తకుడు రాజుగారిని ఒంటరిగా చూసి ఏమన్నాడంటే. "మహారాజా! నా వెంట ఒకబానిస పిల్లను తెచ్చాను. ఆమెను మించిన సౌందర్యవతి ప్రంపంచంలో ఎక్క డాలేదు. మీకు ఆమె నచ్చినట్టయితే కోటి మొహరీలకు ఆమెను ఇచ్చేస్తాను " అని అన్నాడు.

రాజుగారు ఆమెను చూడటానికి ఒప్పుకున్నాడు. వర్తకుడు బానిసపిల్లను మేనాలో అంతఃపురానికి తెప్పించాడు.ఆమెమేనాలో నుంచి దిగుతుండగా చూసి రాజు ఆమెను చూసి ఆమెనే తప్ప మరొకరిని పెళ్ళాడనని నిశ్చయించుకున్నాడు. కోటి మొహరీలు పుచ్చుకుని బానిసపిల్లను రాజాంతఃపురంలో వదిలి వర్తకుడు తన స్నేహితులతో సహా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయినాడు.

రాజుగారు తన పెళ్ళికి శుభముహూర్తం పెట్టించి ఈ లోపుగా రాణిగారి కోసం సముద్రతీరాన దివ్యభవనం కట్టించాడు. అది తన భార్యకు భరణంగా ఇచ్చేశాడు. రాజుగారికిన్ని బానిసపిల్లకున్నూ అతి వైభవంగా వివాహం జరిగింది. కొత్తరాణిగారు తన భవనం ప్రవేశించింది.

ఇప్పుడు రాజుగారి ఒక దిగులు పట్టుకున్నది.రాణిగారు తనతో నోరుతెరచి ఒక్క ముక్క మాట్లాడదు. ఎప్పుడూ తన భవనంలో కూర్చుని సముద్రంవైపు చూస్తూ ఉంటుంది. భర్త వస్తే లేచి నిలబడదు. భర్తను గౌరవించదు.

ఒక సంవత్సరం గడిచిపోయింది. తనభార్య విచిత్రపు వర్తనకు కారణం ఏమిటో తెలుసుకోవాలని రాజుగారు చాలా ప్రయత్నించాడు కాని లాభం లేక పోయింది. ఆమె నోరు విప్పదు.

ఇంతలో రాణిగారు గర్భవతి అయి ఒక మగపిల్లవాణ్ణి కన్నది. ఈ వార్త రాజుగారికేగాక దేశంలో ప్రజలందరికి ఎంతో సంతోషం కలిగించింది. ఎందుకంటే