పుట:Chandamama 1947 07.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్లాసు వరకు చదివాడేమో. గాంధితాత తన కధ రాసుకుంటూ ఇలా అన్నాడు: "ఆ రోజుల్లో చదువుమాట ఎలాఉన్నా మాష్టార్‌ని తిట్టటం మాత్రం నేర్చుకొన్నాను. నేను వట్టి మొద్దబ్బాయిని. ఒక్క అక్షరంముక్క నాకు అంటేది కాదు. ఇప్పుడు చెప్పింది ఇంకా కాసేపటికి మరచిపోయేవాణ్ణి"

అంటే గాంధితాత చిన్నతనంలో మనలాగానే మామూలు కుర్రవాడన్న మాట.

మన తాతయ్య ఏడేళ్ళవాడై ఉండగా వాళ్ళనాయన రాజకోట సంస్థానంలో ఉద్యోగిగా ప్రవేశించాడు. మన తాతయ్యకూడా తండ్రివెంటవెళ్ళి అక్కడ బళ్లోనే కొంతకాలం చదివి హైస్కూలులో చేరాడు. మనతాతయ్య అక్కడ చదువుతుండగా ఒకసారి భలేగమ్మత్తు జరిగింది. ఇన్‌స్పెక్టరు తనిఖీకి వచ్చాడు. పిల్లలకు డిక్టేషన్ వ్రాయమని ఐదు గొట్టుమాటలు ఇంగ్లీషులో చెప్పాడు. మనతాతయ్య "హరిశ్చంద్రుడు" లాంటి కష్టమైన ఒక ఇంగ్లీషుమాట తప్పువ్రాశాడు. మాస్టరు అదిచూచి 'ప్రక్కపిల్లవాడి పలకలోచూచి తప్పు దిద్దుకో మని తాతయ్యకు సైగచేశాడు. నువ్వూ నేనూ ఐతే అలాంటి మాస్టరుదొరికినందుకు ఎంతసంతోషించే వాళ్ళం? కాని మనతాతయ్యకు మొదటినించీ, అబద్ధ మాడకూడదనీ, దొంగతనం చేయకూడదనీ ఒకపిచ్చి ఉండేది. అందుచేత పక్కవాడి పలక చూచి తప్పు దిద్దుకోలేదు. మాస్టరుకు భలేకోపం వచ్చింది. ఇన్‌స్పెక్టరు పోయిన తర్వాత గాంధితాతను పిలిచి - "నీకు బుద్ధిలేదా? నేను పక్కకుర్రవాడి పలకచూసి నిన్ను దిద్దుకోమనలా? ఎందుకు దిద్దుకోలేదూ?" అని అడిగాడు.

"నేనీ బళ్లోనించి పొమ్మనా పోతాను గాని చచ్చినా దొంగతనం చేయను," అన్నాడు గాంధీతాత మాస్టరుతో, చాశారా ఇలాంటి మొద్దుపనులు చేసే ఆయన తాతయ్య అయ్యాడు. లేకపోతే మనందరికీ ఒకే తాతయ్య ఎలా దొరికేవాడు?