పుట:Chandamama 1947 07.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాములో పోటీ పెట్టించాడు. రుద్రమ్మ అనాయాసంగా సేనానికొడుకును ఓడించి వేసింది. నారమ్మ తనకళ్లను తాను నమ్మలేకపోయింది. ఆపోటీ చూచినప్పటినుంచి కూతురుచేత సాముగరిడీలు మానిపించాలన్న పట్టుదల మరీ ఎక్కువైపోయింది. భర్త గణపతిదేవునితో పోరుకాడి ఎలాగైతేనేం ఆయనను ఒప్పించింది. వెంటనే రాజ్యమంతటా "రుద్రమ్మను ఓడించినవారికి ప్రధాన సేనానిపదవి యిస్తాము," అని చాటింపు చేశారు.

మేము ఓడించగలమంటే మేము ఓడించగలమని కొమ్ములు తిరిగిన యోధులు, రాజకుమారులు వచ్చారు. కాని రుద్రమ్మను ఓడించినవారు లేకపోయారు. ఇక రుద్రమ్మకు ఆయుధం విడిచి పెట్టవలసినపని లేకపోయింది.

ఈ రుద్రమదేవే గణపతిదేవుని తరువాత చాలకాలం అంగరంగ వైభోగంగా కాకతీయరాజ్యం ఏలింది. ఈమె మనుమడే ప్రతాపరుద్రదేవుడు. ఈమె పరిపాలనలో జరిగిన విశేషాలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకోమాటు మీకు చెప్పుతాను.