పుట:Chakkatladanda.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

- డాక్టర్ చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి


తెలుగులో వ్రాయాలి, అచ్చ తెలుగులోనే వ్రాయాలి అనే కోరికా పూనికా మధ్య మధ్య కొందరికి కలిగింది. అటువంటి రచనలవల్ల రచయిత పూనిక నెరవేరుతుంది. పాఠకులకు భాషా పరిజ్ఞానము కలుగుతుంది. కాని దానివల్ల చాలా కృతకమైన భాష ఏర్పడుతుంది కూడా. పుడమిదయ్యము, బొమ్మ గ్రుడ్డు, కడలి మొల, నూలుచేడియ, కనినపడుచు, మంచిమెడ, యెకిమీడు మొదలైన పదాలకీ, ఈ పూనికకి పేగు సంబంధం ఉంది. ఆయాపదాలు ఆయా కావ్యాలకు ముందూ లేవు; తర్వాత వాడుకలోకి రాలేదు; అవి ఆయా కవుల కిట్టింపు ధోరణికి, అతుకుల బుద్ధికి పరిమితమయిపోయాయి; లోకానికి క్షేమం.

దాదాపు నూరేండ్ల క్రిందట అచ్చ తెలుగులో ఈ 'చక్కట్ల దండ' వెలసింది. లౌకిక నీతి మాలిక అన్న సంస్కృత సమాసానికి తెలుగులో ఏర్పడిన అతుకుల బొంత పేరు చక్కట్ల దండ. అయితే ఒక్క పేరులో తప్ప, సామాన్య పాఠకులకు సులభంగా అర్థంకాని పదాలు ఇందులో లేనట్లే; సంతోషం.

దాసువారు సంస్కృత సమాలను ఈ శతకంలో వాడలేదు. ఇది అచ్చ తెలుగు కావ్యాల పద్దతియే, అచ్చ తెలుగులో అదృశ్యమైనది సంస్కృత సమం మాత్రమే కాని ఆంగ్లమూ, ఉర్దూ చొరబడ్డాయి. అవి తెలుగులో ప్రవేశించి వాడుక లోకి వచ్చాయికదా అని కవిగారి వాదం. సంస్కృత పదాలూ ప్రవేశించినాయి కదా? మరి వాటికిలేని స్థానం ఉర్దూ, ఇంగ్లిషులకు ఎల్లా దక్కింది?

దీనికి చారిత్రక కారణం వెతకాలి. తెలుగులో అచ్చ తెలుగు కావ్యాలు పుట్టేనాటికి సంస్కృత సమాలే ఎక్కువగా ప్రవేశించాయి. కనుక అచ్చ తెలుగు అనగానే సంస్కృత పదాలను పరిహరించవలసి వచ్చింది. అచ్చ అంటే, 'సంస్కృత సమేరకంబయిని భాష' అని లక్షణ వేత్తలు నిర్ణయించారు. దానువారు ఈ సంప్ర దాయాన్నే కొనసాగించారు. కాని అచ్చ తెలుగుమీద, వల్ల మాలిన వ్యామోహం లేకపోవడంవల్ల, దైనందిన వ్యవహారంలోని విదేశీ భాషాపదాలను వీరు వాడినారు. అస్తు.

నీతి పద్యాల్లో సువతీశతకం మకటాయమానమైనది; వేమన పద్యాలు అత్యంత సుందరాలు. అయితే సామాజిక పరిస్థితులను బట్టి అనేక నీతి పద్యాల శతకాలూ (విశేషించి సీసపద్య శతకాలు) సంపుటులూ వెలువడ్డాయి. చక్కట్ల దండ ఒక చక్కని పద్య శతకం. (తెలుగు శతకాలు సర్వసాధారణంగా అష్టోత్తర శత సంఖ్యా విస్తృశం. చక్కట్లదండ శతమాన పరిమితం.)