పుట:Bobbili yuddam natakam.pdf/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాంకము. 69

బుస్సీ. - అది వారిఫిరంగి యని నిశ్చయమా ?

రాజు. - ఇంకను సందేహమా? ఎదుట నున్న, మమ్ము గుఱి పెట్టుదు రని మేము పరారి చేసి వచ్చినారము.

బుస్సీ. - ఓయి సిపాయి, ఇదే నాకడపటి యాజ్ఞ,

[ద్వి. నిష్క్రమించును.

[నేపథ్యమున - కౌలోకౌలు.]

ఫిరంగి ప్రముఖా గ్నేయాస్త్ర ధ్వనులు. -

మార్ ! మార్ ! పైర్ ! పైర్ !

ప్ర. - [ప్రవేశించి] మనఫిరంగీలు పేలినవి. కోటబురుజు లంతట మనుష్యులని పేలింది, సిబ్బందీలని పేలింది. మనవాళ్లు అన్ని పక్కలా ఒక్కమాటే కోట కూల్చడానికి ఫిరంగీలు కాలుస్తున్నారు.

[అని నిష్క్రమించును.

ద్వి. - [ప్రవేశించి] సలాం సర్కార్, ధర్మారావుకీముందు మిగిలి ఆడంగులు లడాయి చేస్తున్నారు. బకాల్ బీబీలు సర్కార్ ! ఆళ్లు కొప్పులు విప్పి వెనకసిగలు దట్టంగా వేసి, పైటచెంగు నడుంకట్టు కట్టి, రాళ్లు రప్పలు వళ్లో కట్టుకొని, రోకళ్లు తీసుకొని, బేరివారిస్త్రీలు కలపటమైనారు. రాళ్లు మనరాణువమీదికి గిరవాట్లు యేస్తారు. ఒడిశాలలతో కొడుతున్నారు. దగ్గిరికి యెల్లిన షోల్జర్లని మండీ యేసుకొని రోకళ్లతో పండబెడుతున్నాఅరు. ఆళ్లమీదికి యెల్లినాడే సిద్బిదీలాల్ ఆడూమర్గయా. సగము మంది సర్దార్లు బకాలుపేటమీదికి ఉడాయించినారు. కడ్మ అందఱు బురుజులకాడ, కింద లడాయిమాని, ఈళ్లలడాయి తమాషా చూస్తావున్నారు. కోటమీద ఆళ్లకి దీపాలు లేవు. మనరాజాదీపాలు ఆళ్లకి వెన్నెల వుంది. దానిచేత ఆళ్లు మనసర్దార్లకీ గురీపెడతారు. వఖ్ గురికి టకీసుల్తాన్ మర్గయా. మనగురికి ఆళ్లు కొంచెంకొంచెం అందుతారు ; ఎక్వా అందడం లేదు. సలాం.

[అని నిష్క్రమించును.

బుస్సీ. - స్త్రీలు యుద్ధము చేయుటా ! సిద్దిబిలాల్ వారిచేత చచ్చుటా ? కోమటిస్త్రీలా ! టకీసుల్తాను దోరినాడూ ! మేము ఎక్కడను ఇట్టిది యెఱుగము ! ఏమి యీగడ్డ బీరము ?

రాజు. - ఏమి ! నేను ముందే చెప్పలేదా ? నన్ను బట్రా జంటిరే మఱి ?

బుస్సీ. - ఏమయ్యా రాజా ? మాకు స్త్రీలతో లడాయి చేయించెదవు నీవు ?

రాజు. - [సమందహాసము] ఓడిపోదు మని భయమా ?

బుస్సీ. - బలే జిత్తులమారివిగా నున్నావయ్యా ? ఆడువారితో జగడము అవమానము కాదా ?

రాజు. - [సమందహాసము] గెలిచిన మానమే.