66
బొబ్బిలియుద్ధనాటకము.
రాజు. - అయ్యయో ! దొరగారూ ! ఏమి యిట్లు సెల విచ్చెదరు ! ఇట్టి హర్కారాల నెందఱ నెన్ని దిక్కులకు వారు పంపినారో ? ఎందఱు తప్పించుకొని పోయియుందురో ? అంధకారమునకు 12000 మన్నె పౌఁజు చేతను ఇలాయీలు వేయించి పట్టపగలు గావించెద. ఎట్లును మీవలన నిపుడు కా దందు రేని, నాకు సెల విండు ; నేను నాయూరి కేఁగి మీపేరు చెప్పుకొని బ్రతికియుండెద.
హైదర్. - సర్దార్, రాయభారి అంతాపనిచేసినాడు! ఈహర్కారాలు ఇంతా పని చేసినారు. ఇంకా జోదులు దొరలు ఏమి చేస్తారో ! కన్క మన షిణేహితులు చెప్పేలాగ వారిని ఏమఱు పాటుగా కొట్టడం షరీ పని నాకీ తోస్తుంది.
బుస్సీ. - ఎవరురా అక్కడ?
దౌవారికుఁడు. - [ప్రవేశించి] ఏమి సర్కార్ ఆజ్ఞ ?
బుస్సీ. - పోయి క్షణములో సర్దార్ల నందఱను తోడ్కొనిరా ?
దౌవా. - చిత్తము సర్దార్.
[అని నిష్క్రమించును.
(నేపథ్యమున కాహళము ఊఁదుదురు.)
బుస్సీ. - ఏమి తంట తెచ్చెదరు రాజా మీరు ?
రాజు. - తంట తీర్చుపని నేను తెచ్చినది.
[సర్దారులు ప్రవేశింతురు.]
బుస్సీ. - కూర్చుండుఁడు.
[అందఱు కూర్చుందురు.
బుస్సీ. - ఇప్పుడు మీరు బొబ్బిలిమీఁదికి నడుపవలయును.
సర్దా. - ఏమి సర్కార్ ! ఇలాగ హుకుం చేసారు ! ఈ చీకటిలో ఈ నిద్ర మబ్బులో యలాగ నడుస్తాం ?
హైదరు. - మామూల్ లేనిమాట వచ్చిం దేమి మీనోట ? మన్కీ చదుర్న ధిక్కరించిన పోగరుబోతులకి మన్మూ ఏమఱుపాటమే కొట్టవాలా లేదూ!
రాజు, - నా 12,000 మన్నె సేనచేత, ఇలాయీలు, కాగడాలు, మతాబులు వేయించి మీకు పట్టపగలు చేసెదను.
హైదర్. - శబాశ్ ! అదీ షరి ! బలే మెహర్బాన్.
ముసేపనాల్. - [గాయము చూపు] ఆరాయబారిది వఖ్పోటు ఇద్గో సర్కార్ ; నేను నడుజ్దాను బొబ్బిలిమీదికి. తెల్లవారేలోపల, వాడ్కీ వాడిదొర్లకీ నేను కర్కర్కర్కర్ కొయ్యవాలా వుంది. బొబ్బిలిజెండా తెగ్గొట్టి, మనజెండా ఎత్తకుంటే నాపేరు ముసేపనాల్ గాదు. నాకీ ఫిరంగివాత వెయ్యండి నేను బొబ్బిలి కొడితే నాకీ యేమీ యిస్తార్.