పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 3] బిల్వమంగళ 115

ఇక్కడే కూర్చుంటాను - చచ్చినా సరే-(ధ్యానించి) గోపాలా! గోపాలా! నేను శ్రీకృష్ణుని ధ్యానిస్తూంటే నీవు కనబడుతా వేమి?--ఇంకోసారి యత్నించెదను. కన్నులారా, చెవులారా, మీరు వీని వ్యామోహము విడువండి. కళ్ళంటే పొడుచుకొన్నాను గాని చెవు లేలాగు మూయగలను? కృష్ణుని రూపము చూడలేక పోయినా, ఆతని మాటలైన వింటాను. కళ్ళులేని లోప మిప్పుడు కనబడుతూంది. మూఢమానసమా, ఈబండ గోపాలుని మరచి నందగోపాలుని ధ్యానించు. గోపాలా! గోపాలా! (ధ్యానించును.)

(గోపాలుడు వచ్చును.)

గోపా - నీ విక్కడా దాగుకొన్నావు? ఏడురోజుల నుండీ నీకోసము ఊరంతా వెతకుతూన్నాను.

బిల్వ - నన్ను నీవు వెదకడమెందుకు?

గోపా - నీవు దిక్కులేని వాడవు - అనాధలను చూస్తేఎ నామనస్సు కరుగుతుంది.

బిల్వ - దిక్కులేనివాళ్ళ మీద నీకు అనురాగ మెందుకు?

గోపా - అది నా నైజము.

బిల్వ - (స్వ) మూఢమానసమా! ఈ గోపాలు డనాధనాధుడైన నందగోపాలుడే కాబోలు! (ప్ర) గోపాలా! గోపాలా! దయజూపి నన్ను దరిజేర్చవా?

గోపా - నీదగ్గర రాను-నన్ను పట్టుకొంటావు!