పుట:Bible Sametalu 2.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
సహనశీలత
1

తెలుగు సామెత : గంజాయి తోటలో తులసి మొక్కవలె

బైబులు సామెత : ముండ్ల తుప్పలలో లిల్లీ పుష్పములాగా (పరమగీతం 2:2)

భారతదేశంలో తులసి మొక్కకున్న పవిత్ర స్థానం అందరికీ తెలిసిందే. నిత్యం వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం ఇస్తుంది తులసి మొక్క. మరో ప్రక్క గంజాయి అనేది మత్తు మందునిచ్చే మొక్క. అది మనుష్యులను వ్యసనపరులను చేస్తుంది. కొన్నిసార్లు గంజాయి తోటలో తులసిమొక్క రావచ్చు. చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా తన అస్తిత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేన్తుంది తులసిమొక్క. తన చుట్టూ ఉన్నవాళ్ళు తనవాళ్ళు హాని చేసే ప్రయత్నం చేసినా ధైర్యంగా తమ అభిప్రాయాన్ని వెల్లడి చేస్తారు కొందరు. అటువంటివారిని చూచి, వాడు గంజాయి వనంలో తులసి మొక్కలాంటివాడంటారు పెద్దలు. అదే విషయాన్ని 'ముండ్ల తుప్పలలోని లిల్లీ పుష్పము' అనే మరో చక్కని ఉపమాన రూపంలో చెబుతుంది బైబులు సామెత. ప్రతికూల పరిస్థితులు ఎదురైనవారు క్రుంగిపోకుండా ఈ సామెతలను చెబుతారు. ప్రతికూల పరిస్థితులకు సర్వశక్తులు ఎదురొడ్డి నిలవాలన్న విషయాన్ని ఈ సామెతల నుండి నేర్చుకోవచ్చు.

ఇదిగాక మరింత ప్రస్ఫుటంగా వేరొక అర్థం అటు బైబులు సామెతలోనూ, ఇటు తెలుగు సామెతలోనూ ద్యోతకమవుతున్నది. అంతగా పేరు లేని వంశంలో ఒక మహానుభావుడు జన్మించి లబ్ధప్రతిష్ఠుడైతే గంజాయి తోటలో తులసిమొక్కలా పుట్టాడంటారు. రావణ కుంభకర్ణాది దుర్మార్గులున్న వంశంలో విభీషణుడు అలాటివాడే. ఈ సామెతనే వ్యతిరేకార్థంలో ప్రయోగించడం కూడా కద్దు. తులసి వనంలో గంజాయి మొక్క చందాన అని కూడా అంటారు. పవిత్ర వంశమొకదానిలో అంతకు ముందెన్నడూ లేని చందాన దుష్టుడొకడు జన్మించి వంశ ప్రతిష్ఠనంతా మంట గలుపుతాడు. మా కడుపున చెడబుట్టావని తల్లిదండ్రులు నిందిస్తారు. నిజానికి ప్రతి కుటుంబంలోనూ ఇలాటి కొరకరాని కొయ్య ఒకడుండడం సామాన్యమే.79