పుట:Bible Sametalu 2.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
1. తెలుగు, బైబులు సామెతలు: మానవ స్వభావం

'లోకో భిన్న రుచిః అని ఆర్యోక్తి. 'జిహ్వకొక రుచిః పుఱ్ఱెకొక బుద్ధి' అంటున్నది ఒక తెలుగు సామెత. మనిషికి మనిషికీ మధ్య శారీరకముగానే కాక బుద్ధులలోను, స్వభావాలలోను ఉండే వ్యత్యాసాలకు ఈ సామెతలు అద్దం పడుతున్నాయి.

ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలందరూ ఒకేలాగా ఉండరు కదా! అంతెందుకు ఒకే చేతికున్న వ్రేళ్లే సమంగా ఉండవు. అలాగే లోకంలో ఉన్న మనుషుల స్వభావాలు కూడా ఒకేలాగా ఉండవు. అందుకే భిన్న స్వభావాలను ఉద్దేశించే విభిన్నమైన సామెతలు ఆ యా భాషలలో ఉన్నాయి.

ఈ అధ్యాయంలో విభిన్న మానవ స్వభావాలకు చెందిన సమానార్థకాలైన తెలుగు, బైబులు సామెతలను పరిశీలిద్దాం. ఇవి 77 ఉన్నాయి. సౌలభ్యం కొరకు వీటిని 16 ఉపవర్గాలుగా పునర్విభజించాను. అవి సహనశీలత, స్నేహము, మూర్ఖత్వము, దౌష్ట్యము, వాక్శుద్ధి-వాచాలత్వము, కపటము, డంబము, సోమరితనము, దురాశ, కృతఘ్నత, లోభము, తారతమ్యము, చిన్నచూపు, అహము, ద్వంద్వ ప్రమాణము, భోజన ప్రియత్వము. ఈ 16 ఉపవర్గాలలో మానవుల మంచితనమును గురించి చెప్పేవి రెండు మాత్రమే. మిగిలినవి మానవుల దుష్ట స్వభావాలకు చెందినవి. దీని అర్థం పరిశోధనలో దొరికిన అధిక సమానార్థక తెలుగు, బైబులు సామెతలు ఈ వర్గాలకు చెందినవి మాత్రమే కావడం. అంతేకాని తెలుగు, బైబులు సామెతలు మనిషి దౌష్ట్యమును గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాయని కాదు అని గ్రహించాలి. మంచిని గురించి మాటలాడే తెలుగు, బైబులు సామెతలు విడివిడిగా చాలా ఉన్నాయని కూడా తెలుసుకోవడం మంచిది.



78