పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. క్రీస్తు మరణం మన మరణంమీద సోకుతుంది

         క్రీస్తు వచ్చిందాకా మృత్యువు లోకంలో రాజ్యం చేసింది. నరులు మృత్యువుకి వెరచారు.కాని క్రీస్తు వచ్చాక ఈ పరిస్థితి మారిపోయింది. అతడు మృత్యువుకి గురై దాన్ని జయించాడు. ఆ మృత్యుంజయుని విజయం నేడు మనకు సంక్రమిస్తుంది. మనం అతనిలోనికి మరణించి అతనితోపాటు ఉత్తానమౌతాం. క్రీస్తు రాకముందు మరణం అంతంలేని చీకటి సొరంగంలా ఉండేది. దానిలోనికి అడుగుపెట్టినవాళ్లు ఇక బయటికి రాలేకపోయేవాళ్ళు. కాని క్రీస్తు మరణం ద్వారా ఆ సొరంగానికి ఆవలి ద్వారం ఏర్పడింది. ఆ ద్వారంగుండా మనం ఆవలివెలుగులోనికీ, జీవంలోనికీ నడచిపోవచ్చు. మృత్యువంటే అందరికీ భయమే. కాని క్రీస్తు విజయం మనమీద సోకడంవల్ల మనం మరణించిగూడ మళ్ళా బ్రతుకుతాం అనేభావం ఈభయాన్ని చాలవరకు తగ్గిస్తుంది.
        పూర్వవేదంలోని భక్తులను ఉత్తానమూ మోక్షమూ అనే విషయాలు అంత స్పష్టంగా తెలియవు. వాళ్లు చనిపోయిన వాళ్ళంతా పాతాళమనే చీకటి కోనేటిలోకి వెళ్ళిపోతారని భావించేవాళ్లు. అక్కడ మృతులు దేవుణ్ణి దర్శింపక, సుఖదుఃఖాలు అనుభవింపక కేవలం నిద్రావస్థలో ఉండిపోతారని యెంచేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో గూడకొందరు భక్తులు ఉత్థానాన్ని గూర్చి అస్పష్టంగానైన మాట్లాడారు. ఉదాహరణకు 16వ కీర్తన వ్రాసిన భక్తుడు
       నీవు నన్ను పాతాళానికి పంపవు
       నీ పరిశుద్దుని గోతిపాలు చేయవు
అని వాకొన్నాడు. తర్వాత నూత్నవేద రచయితలు ఈ వాక్యాన్ని మృతక్రీస్తుకి అన్వయింపజేసారు - అచ 2,27. రెండవ మక్కబీయుల గ్రంథం ఉత్తానాన్ని గూర్చి ఇంతకంటె స్పష్టంగా మాట్లాడుతుంది. యూదా మక్కబీయుడు రెండువేల వెండినాణాలు ప్రోగుజేసి యుద్ధంలో చనిపోయినవాళ్ళకు పరిపరిహార బలిని అర్పించడానికి యెరూషలేముకు పంపాడు. మృతులు మళ్లాఉత్తానమౌతారని విశ్వసించాడు కనుకనే అతడు ఈపుణ్యకార్యం చేయించాడు- 12,43.
      నూత్నవేదంలో పౌలు మనం క్రీస్తు మరణంలోనికి మరణించిన అతనితో ఉత్తాన మౌతామని మాటిమాటికి చెప్తూంటాడు. ప్రభువు సిలువ మరణం మరణించేంతవరకూ విధేయుడయ్యాడు - ఫిలి 2,8.అతడు గోదుమ గింజలాగ భూమిలోపడి చివికిపోయాడు. కాని మళ్ళా మొలకెత్తి విస్తారంగా ఫలించాడు-యోహా 12,24. అనగా మరణాన్ని జయించి జీవనమూర్తి అయ్యాడు. నేడు మనం క్రీస్తు మరణంలోనికి జ్ఞానస్నానం పొందుతాంరోమా 6,3–4. దీనివలన పాపజీవితానికి చనిపోయి పుణ్యజీవితానికి ఉత్థానమౌతాం. జ్ఞానస్నానం ద్వారా ప్రభువు మరణం మనమీద సోకుతుంది. అతని చావు మన చావుని