పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేని మనం పుట్టువునకు ఇష్టపడతామని అనుమతి నీయలేము కదా! కాని ఓ మారు పుట్టామో దేవుడు మనలను స్వాతంత్ర్యపు ప్రాణులనుగా పుట్టించాడు. స్వాతంత్ర్యంతో పుట్టాక దేవుడు మన స్వాతంత్ర్యాన్ని మన్నించకుండా వుండటం ఉచితం కాదు. కావుననే ఆ సర్వశక్తిమంతుడు మన స్వాతంత్ర్యాన్ని మన్నిస్తూ మనలను బలవంత పరచకుండా, మనం చేసే సత్కార్యాలతో సహకరిస్తూంటాడు. ఎవరు ఎలాంటి యిల్లు కట్టుకున్నారో అలాంటి యింట్లోనే వసిస్తారు. మనంకూడా బుద్ధిపూర్వకంగా ఏయే కార్యాలు చేసామో ఆయా కార్యాల ఫలితాన్నే అనుభవిస్తాం.

3. సహాయక వరప్రసాదాలను పొందే మార్గం

పవిత్రీకరణం విశేషంగా పావనాత్మ పని. పవిత్రీకరణ వరప్రసాదాన్నిలాగే సహాయక వరప్రసాదాన్ని గూమ మనకనుగ్రహించేది ఆ దివ్యాత్మయే. ఈ యాత్మ ఓ దేవాలయంలో లాగ మన హృదయాలలో వసిస్తూంటూంది. కావున మనలోనికి మనం ప్రవేశించి మన హృదయంలో నెలకొని వున్న ఆ దివ్యాత్మను దర్శించాలి. అతనికి మొక్కులిడాలి. "ప్రభువు నాతో పల్కేపల్కులు ఆలిస్తాను" అన్నాడు కర్తీనకారుడు - 85 8. క్రీస్త్వనుసరణ గ్రంథకారుడు కూడా "అంతరాత్మలో ప్రభువు పల్కే పల్కులు ఆలించి ఆ ప్రభువు నొద్దనుండి ఓదార్పును పొందేనరుడు భాగ్యవంతుడు" అంటాడు-3,1,1. ఔను. పావనాత్మ మన హృదయంలో సంభాషిస్తూంటుంది. ఆ యాత్మ పలుకులు మనకు వెలుగునీ, ఓదార్పునీ, శక్తిని ప్రసాదిస్తుంటాయి. కావున విశ్వాసులు ఆ యాత్మతో చక్కని పరిచయం కలిగించుకోవాలి. "వేనిసాంకైస్పిరితుస్’ అనే గీతం వర్ణించినట్లుగా, ఆ యాత్మ మన యాత్మకు గారాబు నెచ్చెలి. బిరాన వరాలొసగే దాత. హృదయాలు వెలిగించే భాగ్యామల జ్యోతి. ఎండువారిన యెడదలమీద మంచు చిలుకుతూంటుంది. శీతల హృదయాలకు వెచ్చదన మిస్తూంటుంది. శ్రమల్లో పరిశ్రాంతి, శోకాల్లో కుస్తరింపు, శోధనల్లో బాధల్లో ఉపశాంతి ప్రసాదిస్తుంటుంది. వేయేల! ఆ దివ్యాత్మ తోడ్పాటు లేనిదే పతితమానవులమైన మనలో పాపంతప్ప మేలిగుణ మొక్కటీ వుండదు. అట్టి విశుద్దాత్మను శరణుజొచ్చి మనకు కావలసిన సహాయక వరప్రసాదాలను అడుగుకొంటూండాలి.

ప్రార్ధనా భావాలు

1. తండ్రి వరప్రసాదాలు చాలా వున్నాయి. కాని వాటన్నిటిలోను శ్రేష్టమైన వరప్రసాదం క్రీస్తే, క్రీస్తుద్వారానే మనకు పాపవిముక్తీ రక్షణమూ లభిస్తాయి. కనుక తండ్రి క్రీస్తుద్వారా మనకు అతి ప్రశస్తమైన వరప్రసాదంఇచ్చాడని చెప్పాలి. ఈ భావాన్నే పౌలు “మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమైంది" అన్న వాక్యంలో వ్యక్తం చేసాడు - తీతు 2,11. ఈ ప్రత్యక్షమైన “దేవుని కృప" క్రీస్తు మనుష్యావతారమే.